సమయం లేదంటున్నారు. కార్యకర్తలూ కమిటీల ఏర్పాట్లూ అన్నీ ఫటాఫట్ అయిపోవాలని తొందరపడుతున్నారు! ఈ నెలాఖరులోపు కమిటీలు ఏర్పాట్లు అయిపోవాలనీ, వచ్చే నెల తొలివారంలోగా కార్యకర్తలంతా శక్తి ఆప్ లో రిజిస్ట్రేషన్ చేసుకువాలని తొందరపెడుతున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదిక, అత్యంత వేగంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని ఉత్తమ్ ప్రకటించారు.
బూత్ కమిటీలను 14 మందితో ఏర్పాటు చేయడానికి ఈ నెలాఖరే చివరి తేదీ అన్నారు. కొన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షుడి నియామకాలు కూడా ఈ నెలాఖరుకే పూర్తి కావాలన్నారు. శక్తి ఆప్ లో కార్యకర్తలూ, కమిటీలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ కూడా ఈ నెలాఖరే అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడంలో కొంత ఆలస్యం జరిగిందనీ, హైదరాబాద్ ప్రాంతంలో కూడా పార్టీ కింది స్థాయి నియామకాల విషయంలో కొన్ని పెండింగ్ ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు. శక్తి ఆప్ కింద రాష్ట్రంలోని కార్యకర్తలందరూ రిజిస్టర్ కావాలనీ, వారికి వచ్చే నెల 15 వరకూ మాత్రమే సమయం ఉన్నట్టు ప్రకటించారు! రాష్ట్రంలోని 31 జిల్లాలకీ కొత్త కమిటీల ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయన్నారు. త్వరలోనే కుంతియాతో కూర్చుని మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.
పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టడం మంచిదేగానీ.. దాన్ని ఇంత ఆదరాబాదరాగా చేయాల్సిన పనేముందనేదే ప్రశ్న..? శక్తి ఆప్ కింద కార్యకర్తల నమోదుకు కూడా చివరి తేదీ పెట్టి, ఆలోగానే రిజిస్టర్ అయి తీరాలని తొందరపెడితే ఎలా..? అయినా, ఈ కార్యక్రమాలన్నీ పదిరోజుల్లోపే జరిగిపోవాలని ఇప్పుడు కంగారుపడటంలోనే.. ఆ పార్టీ వ్యూహంలోని లోపం కనిపిస్తోంది. పార్టీ కమిటీలు, మండల స్థాయి నియామకాలు, అర్బన్ ప్రాంత డివిజన్ కమిటీలు అనేవి ఇప్పటికే వేసి ఉండొచ్చు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన దగ్గర నుంచే ఈ ప్రయత్నాలు మొదలుపెడితే బాగుండేది
పార్టీ పటిష్టత విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్లానింగ్ సరిగా లేదన్నది మొదట్నుంచీ విశ్లేషకులూ విమర్శలూ చెబుతూ ఉన్నదే. పీసీసీగానీ, సీఎల్పీగానీ ఇన్నాళ్లూ కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలూ ఆధిపత్య పోరాటాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా ఏఐసీసీ చెప్పిందనీ, రాహుల్ గాంధీ దిశా నిర్దేశించారంటూ తొందరపడుతున్నారు. పార్టీకి అత్యంత కీలకమైన బూత్ కమిటీలు, కిందిస్థాయి నియామకాలపై ఇలా ప్రాధాన్యత లేని కార్యక్రమాలుగా పూర్తిచేయాలనుకోవడం పార్టీ బలోపేతానికి పనికొచ్చే చర్య అవునో కాదో వారికే తెలియాలి.