ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై … పవన్ కల్యాణ్ అవినీతి ఆరోపణలు ప్రారంభించిన తర్వాత ఇరువురి మధ్య రాజకీయంగా సఖ్యత లేదు. ఆధారాలు లేకపోయినా.. విమర్శించడం తన రాజకీయ హక్కు అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఉన్నారు. అదే సమయంలో… పవన్ కల్యాణ్‌పైనా.. చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల ముందు నుంచి.. నిన్నామొన్నటి వరకూ.. కొనసాగిన చంద్రబాబు, పవన్ స్నేహం ఇప్పుడు పూర్తిగా మసకబారిపోయింది. ఎంతగా ఉంటే.. పక్కపక్కనే నిలుచున్నా… కనీసం పలకరించుకోలేనంతగా.. వీరి మధ్య స్నేహం తగ్గిపోయింది.
అమరావతి ప్రాంతంలోని నంబూరులో.. దశావతార వెంకటేశ్వరుని ఆలయాన్ని లింగమనేని సంస్థ యజమానులు నిర్మించారు. నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట ఈ రోజు జరిగింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఇద్దరూ దాదాపుగా ఒకేసారి కార్యక్రమానికి వచ్చారు. స్వామి వారికి సేవలు చేసే సమయంలో పక్కపక్కనే నిలుచుకున్నారు. కానీ ఒకరికొకరు మాట్లాడుకోలేదు. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు.
నిజానికి చంద్రబాబు రాజకీయాలను రాజకీయాలుగానే చూస్తారు. ఆయన దేన్ని వ్యక్తిగతంగా తీసుకోరు. వ్యక్తిగతంగా తిట్టినా లైట్ తీసుకుంటారు. ఈ విషయం రాజకీయాల్లో ఉన్న వారందరికీ తెలుసు. అందుకే.. చంద్రబాబును ఘాటుగా విమర్శించిన వాళ్లెందరో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇతర పార్టీల్లో ఉన్న వ్యక్తిగతంగా కలిసినప్పుడు అప్యాయంగా మాట్లాడుతారు చంద్రబాబు. కానీ ఈ మెంటాలిటి పవన్‌కు లేదు. గతంలో పలు సందర్భాల్లో.. పీఆర్పీ వ్యవహారాల్లో… అనేక మంది చిరంజీవిని మోసం చేశారని..వారందర్నీ గుర్తు పెట్టుకున్నాని.. వారి తాట తీస్తానని కూడా ప్రకటన చేశారు.
మొత్తానికి దాదాపుగా నాలుగేళ్ల పాటు.. చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు చాలా ప్రయారిటీ ఇచ్చారు. కారణం రాజకీయాలే అయినా పవన్ కల్యాణ్ లేనెత్తిన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. కలుస్తానంటే.. ముఖ్యమైన కార్యక్రమాలనూ రద్దు చేసుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఎదురుపడినా మాట్లాడుకోలేనంతగా రాజకీయాలు విడదీశాయి.