మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను..పార్టీ అధ్యక్షుడు రాహుల్ తో పాటు .. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. చాలా రోజులుగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. 2015లో గ్రేటర్ ఎన్నికల సందర్భంగానే దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఓ తేదీని కూడా అనుకున్నారు. టీఆర్ఎస్ భవన్ చుట్టూ ఫ్లెక్సీలు కూడా.. పెట్టుకున్నారు. కానీ చివరి క్షణంలో టీఆర్ఎస్ లోచేరాలన్న నిర్ణయాన్ని దానం నాగేందర్ వాయిదా వేసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరాలనుకున్నారు. కానీ కేసీఆర్ హరీష్ రావు సమక్షంలో పార్టీలో చేరమని సూచించినట్లు సమాచారం. తనకు పార్టీలో చేరకుండానే ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న ఉద్దేశంతో దానం అప్పట్లో వెనక్కి తగ్గారని ప్రచారం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ కూడా బుజ్జగించడంతో.. సైలంటయిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొనడం లేదు. ఇటీవలి కాలంలో పార్టీ పదవుల విషయంలోనూ.. దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. తనను పదవి నుంచి తీసేసి గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అంజన్ కుమార్ ను నియమించారు.
ఎన్నికల వేడి పెరుగుతూండటంతో.. చివరికి ఆయన కాంగ్రెస్ కు గుడ్ పై చెప్పాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లో మాస్ లీడర్ గా పేరున్న దానం నాగేందర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు. 2004లో అసిఫ్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కు హైకమాండ్ టిక్కెట్ ఇవ్వకపోతే.. టీడీపీలో చేరి అదే స్థానం నుంచి గెలుపొందారు. కానీ వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడంతో టీడీపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉపఎన్నికల్లో ఓడిపోయారు. కానీ 2009లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవిని పొందారు. వైఎస్ లేకపోయినా ఐదేళ్లు మంత్రిగా కొనసాగలిగారు. దానం నాగేందర్ మళ్లీ టీఆర్ఎస్ వైపే చూస్తున్నారని.. ఆయన అనుచరులు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటున్నారు.