ఓ వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ మరో వైపు ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్న వైసీపీ నేతలు మాత్రం.. ఈ సారి పవన్ కల్యాణ్ పోటీ చేయడం డౌటే… గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్లు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తారని చెబుతున్నారు. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతివ్వబోతున్నట్లు ప్రకటించారు. తనకు ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారని కూడా చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ తనకు చెప్పారని..అయితే అవినీతి పెరిగిపోయిందని అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్కు మద్దతిస్తానని చెప్పారట.
వరప్రసాద్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గత మార్చిలో కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తనను ఆహ్వానిస్తే వెళ్లి మాట్లాడానని… అప్పుడే జగన్ కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినట్లు.. వరప్రసాద్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా మీడియాకే చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. బీజేపీ, వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయని చెప్పేందుకు వరప్రసాద్ వ్యాఖ్యలను పలుమార్లు ఉదహరించారు కూడా. అయినా వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ ఖండించలేదు.
కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహంలో తేడా కనిపిస్తోందన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో ఉన్నాయి. ప్రత్యేకహోదా లాంటి విషయాల్లో కేంద్రంపై విమర్శలు చేయాల్సిన పవన్ కల్యాణ్… పూర్తిగా తన దృష్టినంతా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై విమర్శలకే కేటాయిస్తున్నారు. బీజేపీతో పాటు..వైసీపీని కూడా ఏమీ అనడం లేదు. వైసీపీ వైపు నుంచి కూడా.. పవన్ పై విమర్శలు తగ్గిపోయాయి. దీంతో సహజంగానే బీజేపీ, వైసీపీ, జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వరప్రసాద్ వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ ఖండించకపోతే మాత్రం.. రెండు పార్టీల మధ్య ఏదో ఉందన్న ఊహాగానాలు మరింత పెరిగే అవకాశం ఉంది.