ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పయనం ఎటు అనే ప్రశ్న ఎప్పట్నుంచో అలానే ఉంది. ఇప్పుడు నల్లారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన మరో టాక్ తెర మీదికి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి నడుం బిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే లక్ష్యంతో ఏపీకి కొత్త వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉమెన్ చాందీని నియమించారు. ఆయన రంగంలోకి దిగారు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చి చేరబోయే నేతలంటూ ఎవ్వరూ లేరు కాబట్టి, గతంలో పార్టీ వీడిన నేతల్నే తిరిగి ఆహ్వానించాలనే కార్యక్రమం పెట్టుకున్నారు. దీన్లో భాగంగా తెర మీదికి వచ్చిన పేరు… నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
రాష్ట్ర విభజన సమయంలో పార్టీ వీడిన నాయకుల్ని వెనక్కి పిలిచే పనిలో పడింది కాంగ్రెస్. అయితే, ముందుగా.. ఏ పార్టీలోనూ చేరకుండా, తటస్థంగా ఉండిపోయిన నేతలపై దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ఇలాంటివారికి సంబంధించిన ఒక జాబితా కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఒప్పించే బాధ్యతను మాజీ మంత్రి పల్లంరాజుకు అప్పగించినట్టు సమాచారం. అవసరమైతే తాను కూడా లైన్లోకి వస్తాననీ, కిరణ్ తో మాట్లాడతానని ఉమెన్ చాందీ భరోసా ఇచ్చారట. రాహుల్ గాంధీతో ఏపీ ముఖ్యనేతల భేటీ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్థావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కిరణ్ వస్తే బాగుంటుందని ఏపీ నేతలు ప్రతిపాదించడంతో, రాహుల్ కూడా ఓకే అన్నట్టు చెబుతున్నారు.
పల్లంరాజుకు నల్లారితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి, ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇక్కడ సమస్య ఏంటంటే… కిరణ్ కుమార్ సోదరుడు కిషోర్ కుమార్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. తమ్ముడు టీడీపీలో చేరారనే భేదాభిప్రాయం కూడా కిరణ్ కు లేదు. పైగా, తనకు అన్నయ్య ఎప్పుడూ అండగానే ఉంటారని కిషోర్ అప్పుడే చెప్పారు. వాస్తవం మాట్లాడుకుంటే.. కిరణ్ కి క్షేత్రస్థాయిలో సోదరుడి అండదండలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసినవే! ఈ నేపథ్యంలో కిరణ్ ను పల్లంరాజు ఏం చెప్పి బుజ్జగిస్తారనేది వేచి చూడాలి. కిరణ్ పాటు కొణతాల రామకృష్ణ, హర్షకుమార్ వంటి నేతల్ని సొంత గూటికి రప్పించే ప్రయత్నం ముమ్మరంగానే పార్టీ ప్రారంభించింది. ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.