హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన సినిమా ‘సర్కార్’ పలు సంచలనాలు సృష్టించింది. ఇప్పుడదే పేరుతో తమిళంలో ఇలయ దళపతి విజయ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన ఏఆర్ మురుగదాస్ ఓ సినిమా తీస్తున్నాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌కి ఆయన అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. అయితే… తెలుగు ప్రేక్షకులే అందులో ఓ లుక్ చూసి ఒకప్పుడు ఎంతో నీతులు చెప్పిన మురుగదాస్ ఇలా చేశాడేంటి అని అనుకోవలసి వచ్చింది. హీరో విజయ్ సిగరెట్ కలుస్తున్న స్టిల్ అసలు విమర్శలకు కారణం!
దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ తనకంటూ కొన్ని రూల్స్ రాసుకున్నాడు మురుగదాస్. అతడి సినిమాల్లో హీరోలు మందు కొట్టరు. సిగరెట్లు కాల్చరు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించరు. ఆఖరికి విలన్లు కూడా గ్రీన్ టీ తాగుతారు. తమిళంలో విజయ్ హీరోగా ఆయన తీసిన ‘కత్తి’ని తెలుగులో చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’గా రీమేక్ చేశారు. అందులో చిరు మందుకొట్టే సీన్లు చూసి మురుగదాస్ అప్సెట్ అయ్యారని మొదట్లో వార్తలు వచ్చాయి. ‘స్పైడర్’ ఇంటర్వ్యూలలో నేరుగా ఆ సంగతి ప్రస్తావించకున్నా… తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హీరోలను ఎంతోమంది అభిమానిస్తారు కనుక చెడు అలవాట్లకు దూరంగా వుంటే మంచిదని చెప్పారు. అటువంటి దర్శకుడు హీరో ఫస్ట్ లుక్‌లో సిగరెట్‌తో చూపించడం జనాలకు మింగుడు పడటం లేదు. మురుగదాస్‌లో ఈ మార్పు ఏమిటో? క్యారెక్టర్ డిమాండ్ చేసి వుంటుంది!!