పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. రెండో పెళ్లికి రెడీ అయిపోయారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసేశారు. కొద్ది రోజుల క్రితం తన చేతిని మరొకరి చేతిలో ఉంచిన ఫోటో పోస్ట్ చేసి… పెళ్లికి రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. నిన్నటికి నిన్న.. తన బాయ్ ఫ్రెండ్ పెట్టే మెసెజ్‌లను మురిపెంగా చూసుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసి.. కాస్తంత చిలిపి కామెంట్లు పెట్టారు. నిజానికి రేణుదేశాయ్ ఓ స్ట్రాటజీ ప్రకారమే.. రెండో పెళ్లి విషయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. మొదట్లో ఓ డాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించినప్పుడు… తనకు తోడు అవసరమని గట్టిగా చెప్పారు. తన పెళ్లికి పిలుస్తానని.. షోలో పార్టిసిపెంట్లకు హామీలు కూడా ఇచ్చేశారు.
ఆ తర్వాత ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఇంటర్యూ ఇచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానన్నారు. కానీ ఎవర్నీ చేసుకుంటానో తెలియదన్నారు . రేణుదేశాయ్ తీరు చూస్తూంటే.. ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్లతోనే ప్రేమలో పడిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ రేణు దేశాయ్‌కు విడాకులిచ్చిన తర్వాత అన్నాలెజ్నోవాను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం.. రేణుదేశాయ్ పెళ్లి చేసుకుంటానంటే.. సహించలేకపోయారు. సోషల్ మీడియాలో ఆమెపై తిట్ల వర్షం కురిపించారు. దానికి ఆమె ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. అలాంటి ఫ్యాన్స్ అందర్నీ మానసికంగా సిద్ధం చేయడానికే.. రేణుదేశాయ్ ఇప్పుడు… ఇలా వరుసగా తన రెండో పెళ్లికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోందన్న అంచనాలున్నాయి.
మూడు రోజుల కిందట.. కుమారుడు అకిరానందన్ ఫోటో పోస్ట్ చేసి… జూనియర్ పవన్ కల్యాణ్ అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలా ఎందుకన్నారో ఎవరికీ అర్థం కాలేదు. అయితే.. ఆ అకిరానందన్ మూడు రోజుల తర్వాత.. పవన్‌కల్యాణ్‌తో కలిసి విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. పవన్ కల్యాణ్ విజయవాడలో కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంట్లో పూజలు చేసి సమయంలో అకిరా కూడా పవన్‌తో పాటే ఉన్నారు. అంటే… రేణుదేశాయ్.. రెండో పెళ్లి… పిల్లల విషయంలో ఏమైనా తేడాలొచ్చాయా..? అందుకే రేణు దేశాయ్ ఇలాంటి పోస్టులు పెడుతున్నారా అన్న అనుమానాలు పవన్ ఫ్యాన్స్‌లో ప్రారంభమయ్యాయి. ఇదే నిజమైతే.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ సర్కస్‌లో ఇరుక్కుపోతారేమో…!