ఒక నాయుడు విడిచి వెళ్లినంత మాత్రాన.. ఆ పార్టీకి భారీ నష్టం! ప్రస్తుతం టి. కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఇదే. దానం నాగేందర్ పార్టీకి దూరమయ్యారు. ఆయన బాటలోనే మరోనేత ముఖేష్ గౌడ్ కూడా ఉన్నారట. వీరితోపాటు హైదరాబాద్ లో స్థానికంగా మరికొంతమంది నేతలు వలసలకు సిద్ధపడుతున్నారు. దీంతో టి. కాంగ్రెస్ లో అనూహ్యమైన కుదుపు. ముందస్తు ఎన్నికలు తప్పవన్న సంకేతాలున్న సమయంలో పార్టీకి ఇది గట్టి దెబ్బే అంటున్నారు.
కొన్నాళ్ల కిందట.. రేవంత్ రెడ్డి టీడీపీని వదిలి వెళ్లారు. అప్పుడు కూడా ఇంతే.. భారీ కుదుపు అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం కలిగిందన్నారు. అది వాస్తవం కూడా! రేవంత్ వెళ్లడంతో టీడీపీకి కాస్తోకూస్తో మిగిలిన ఊపు కూడా తగ్గిపోయింది. ఆయనతోపాటు కొంతమంది నేతలు కూడా వెళ్లిపోయారు. అదీ గట్టి దెబ్బే. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీల్లో ఒక్క నాయకుడు బయటకి వెళ్తే చాలు.. భారీ కుదుపు అనే స్థాయిలో ఉన్నాయి. దాన్నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుందనే పరిస్థతికి వచ్చేశాయి. నాయకుడి కన్నా పార్టీ పెద్దది కదా! అలాంటప్పుడు, ఒక నాయకుడు వెళ్లిపోయినంత మాత్రాన.. పార్టీ ఎందుకు చిన్నదైపోయినట్టు కనిపిస్తోంది..?
తెలంగాణ విషయంలో టీడీపీ చేసిన పొరపాటే కాంగ్రెస్ కూడా ఇప్పటికీ చేస్తూ ఉంది! అదే.. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని నిర్మించుకోలేకపోవడం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ద్వితీయ శ్రేణిపై ఏమాత్రం దృష్టి సారించలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నా… ఆ పార్టీ రాజకీయాలు కేవలం రాష్ట్రస్థాయి నేతలకే పరిమితమౌతూ వస్తోంది. సభ్యత్వ నమోదు, కార్యకర్తల్ని మొబైల్ ఆప్ లో రిజిస్ట్రేషన్ చేయడం మాత్రమే సరిపోదు. ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతల్ని వలేసి చేర్చుకోవడమే బలోపేత చర్యగా చూస్తున్నారు. అంతేగానీ, కాంగ్రెస్ నుంచి కూడా అలాంటి పేరున్న నేతలు దూరమయ్యే పరిస్థితి ఒకరోజు వస్తుందనే అంశాన్ని వదిలేశారు.
క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై చర్యలు చేపట్టకపోవడమే అసలు సమస్య. దశలువారీగా కిందిస్థాయిలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తే… ఒక నాయకుడు వెళ్లగానే ఇంతగా తత్తరపాటు పడాల్సిన పరిస్థితి రాదు. పై స్థాయిలో ఒక నాయకుడు వెళ్లగానే, ద్వితీయ శ్రేణిలో ఉన్నవారికి అవకాశం కల్పించే పరిస్థితి ఉండాలి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం టి.కాంగ్రెస్ లో లేదు. రాబోయే రోజులన్నీ వలస రాజకీయాలే ఉంటాయి. కాబట్టి, పార్టీ బలోపేతం చేయడమంటే ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం కాదు… సొంత పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పెంపొందించుకోవాలనే ముఖ్యాంశాన్ని గుర్తించాలి. ఏ పార్టీకైనా ఇది పాఠమే. వందేళ్లు చరిత్ర ఉన్న కాంగ్రెస్ నుంచి కొత్తగా చేరినవారూ వెళ్లినవారూ లేకపోలేదు. కానీ, తెలంగాణలో వలసల వల్లనే బలహీనమౌతున్న పరిస్థితి కనిపిస్తోంది.