మున్నాభాయ్, త్రీ ఈడియట్స్, పీకే… ఇలా వైవిధ్యభరితమైన చిత్రాలతో చిత్రసీమలో తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నాడు రాజ్ కుమార్ హిరాణీ. మానవ విలువలకు, ఓ కొత్త నేపథ్యం, కమర్షియల్ విలువలు జోడించడంలో రాజ్‌కుమార్ శైలి ప్రత్యేకం. ఆయన కథలన్నీ యూనివర్సల్ అప్పీల్‌తో ఉంటాయి. ప్రస్తుతం ఆయన బాటలోనే నడుస్తున్నాడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబు 25వ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రాజ్‌కుమార్ హిరాణీ స్టైల్లో సాగే సినిమా అని తెలుస్తోంది. ఓ అపర కుబేరుడి ప్రస్థానాన్ని ఈసినిమా ద్వారా చూపించబోతున్నార్ట. ఆ పాత్రలో మహేష్ కనిపించబోతున్నాడు. హీరోయిజం కంటే, నైతిక విలువలు, మానవ సంబంధాలపై వంశీ పైడిపల్లి ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి.. ఈ సినిమాలో మాస్ అంశాల్ని మరీ ఎక్కువ ఆశించకూడదన్నమాట. మహేష్ ఈ సినిమాలో ఎంబీఏ స్టూడెంట్‌గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అది నిజమే అయినా.. స్టూడెంట్ లైఫ్ కేవలం ఓ భాగం మాత్రమే అని తెలుస్తోంది. అల్లరి నరేష్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి అశ్వనీదత్, దిల్‌రాజు నిర్మాతలు.