2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ … వైసీపీకి మద్దతిస్తాడని.. ఆ విషయం తనకు నేరుగా చెప్పారని.. మాజీ ఎంపీ వరప్రసాద్ మీడియా ఎదుట నేరుగా చెప్పారు. వరప్రసాద్ ఇలా చెప్పడం మొదటిసారి కాదు. గతంలోనూచెప్పారు. అలాగే అమరావతిలో జరిగిన ఓ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్వసంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇరవై నిమిషాల సేపు చర్చలు జరిపారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అంటే ఓ వైపు.. వైసీపీకి మద్దతిస్తారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరో వైపు చంద్రబాబుతో చర్చల తర్వాత పవన్ కల్యాణ్ మనసు మార్చుకున్నారని..టీడీపీ వైపు ఉంటారని సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం ప్రారంభించింది.
ఈ రెండూ జనసేన ఇమేజ్ను డ్యామేజ్ చేసే పరిస్థితి ఉండటంతో.. తన ఖండనను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. నిజానికి అది ఖండనలా లేదు వివరణలా ఉంది. ఎందుకంటే.. తనపై నేరుగా ప్రచారం చేస్తున్నా.. అలా చేయవద్దని నేరుగా చెప్పలేనంత నిస్సహాయత ఆ ప్రకటనలో కనిపించింది. వైసీపీ, టీడీపీ నేతలు ఏదో ఒక సమయంలో తారసపడుతుంటారని వారితో మాట్లాడినంత మాత్రాన ఏదో అయిపోతుందని ఊహించుకోవద్దని ఆ ట్వీట్ సారంశం. రాజకీయాలను వ్యక్తిగత కోణంలో చూడనని కూడా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ.. మాజీ ఎంపీ వరప్రసాద్ మాత్రం.. తనను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారని చెబుతున్నారు. పవన్ తనతో ఏం మాట్లాడారో.. వర్డ్ టు వర్డ్ చెబుతున్నారు. అయినా.. దీన్ని రాజకీయ ప్రకటనగానే పవన్ చూస్తున్నారు. అలా చూసినా పవన్ కల్యాణ్.. ఖండించాల్సింది. వరప్రసాద్ తో వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉంటే.. అది ఒక్క పవన్ కల్యాణే ఎందుకు గౌరవిస్తున్నారు. వరప్రసాద్ ఎందుకు గౌరవించడం లేదు.
రాజకీయాల్లో ఒక పార్టీ తరపున ఇంకో పార్టీ నేతలు ప్రకటనలు చేయడం అరుదు. అలా చేసే అవకాశం ఎవరూ ఇవ్వరు. కానీ జసనసేన విషయంలో మాత్రం.. వైసీపీ నేతలు ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. దీన్ని తిప్పికొట్టడానికి పవన్ కల్యాణ్ మొహమాటపడుతున్నారు. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి..అని ఘాటుగా తిప్పికొట్టలేక… వివరణలా … ఎవరినీ నొప్పించకుండా ఓ ప్రకటన జారీ చేస్తున్నారు. దాని వల్ల జనసేనే కార్యకర్తల్లో గందరగోళం పెరుగుతుంది తప్ప… కొత్తగా వచ్చే లాభం ఏముంటుంది…? ఈ విషయంలో పవన్ మరింత రాజకీయం నేర్చుకోవాలేమో..!