వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా `యాత్ర` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీన్నో వైకాపాకి కరపత్రంగా వాడే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున `ఎన్టీఆర్` బయోపిక్‌ని రంగంలోకి దించినట్టు.. వైకాపా తరపున `యాత్ర` రాబోతోందన్నమాట. ఈ చిత్రానికి వెనుక నుంచి పెట్టుబడి అందిస్తోంది జగన్ పార్టీ పెద్దలే అని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. అంతేనా…? స్క్రిప్టు మొత్తం జగన్ చేతిలో పెట్టి, ఆయన `ఓకే` అన్న తరవాతే.. ఈ సినిమా పట్టాలెక్కిందని టాక్. తీస్తోంది వైఎస్సార్ బయోపిక్ కాబట్టి, తనయుడిగా జగన్‌కు స్క్కిప్టు చదవాలన్న ఆశ, అందులో ఏముందో తెలుసుకుకోవాలన్న కుతూహలం ఉండడం సహజం. అయితే సెట్లోనూ జగన్ మనుషులే కనిపిస్తున్నారని, ఏపూటకాపూట అప్‌డేడ్స్ వైకాపా పెద్దలకు అందుతూనే ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి వైఎస్సార్ జీవితం మొత్తం ఈ సినిమాలో రంగరిద్దామనుకున్నారు. కానీ.. ఆ ఆలోచన మారిందట. కేవలం పాద యాత్రకు ముందు, తరవాత పరిస్థితులు, పాద యాత్ర జరిగిన తీరుతెన్నులు మాత్రమే కథలో ఉంటాయని తెలుస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ పాత్రలకు ఈ కథలో అంత ప్రాధాన్యం లేదని సమాచారం. మొత్తానికి కథ, స్క్రీన్ ప్లే ఎవరివైనా – వెనుక నుంచి డైరెక్షన్ చేస్తోంది మాత్రం వైకాపా పార్టీనే అన్నది టాలీవుడ్ జనాల మాట. మరి చిత్ర రూపకర్తలేమంటారో?