జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పూర్తిస్థాయిలో ఆంధ్రాకి మకాం మార్చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయవాడలో ఒక అద్దె ఇంట్లోకి సతీసమేతంగా గృహ ప్రవేశం చేశారు. పవన్ అద్దెకు తీసుకున్న ఇల్లు కోగంటి సాంబశివరావు అనే వ్యక్తిది. ఇందులో పెద్దగా వింత లేకపోయినా.. పడమటలంకలో పవన్ ఇల్లు అద్దెకు తీసుకోవడమే కాస్త ఆసక్తికరమైన అంశం! బెజవాడ రాజకీయాల్లో సామాజిక వర్గాల కీలకపాత్ర పోషిస్తాయనేది తెలిసిందే. పడమట ప్రాంతమంతా ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. పవన్ ఇల్లు తీసుకున్న ప్రాంతంలోనే ఎంపీ కేశినేని నాని అధికారిక నివాసం ఉంది. వాస్తవానికి ఆయన వేరే ప్రాంతంలో ఉంటున్నా.. సెంటిమెంట్ గా పాలిటిక్స్ మాత్రం అక్కడ్నుంచే చేస్తారట!
ఇక, ఈ పవన్ ఇల్లు అద్దెకు తీసుకున్న ప్రాంతమంతా టీడీపీ మద్దతుదారులు, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువ. అలాగని ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వీల్లేదని ఎవ్వరూ చెప్పరు. ఇతర సామాజిక వర్గాలవారు చాలామంది ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాకపోతే, పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయం చేస్తున్నదే టీడీపీకి వ్యతిరేకంగా కదా! దాంతోపాటు, ఒక సామాజిక వర్గం పవన్ ను తమ ప్రతినిధిగా భావిస్తోంది. ఆ సామాజిక వర్గానికి చెందినవారు.. ఈ ప్రాంతానికి చీటికీమాటికీ రావడానికి పెద్దగా ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ పవన్ ఇంటి దగ్గర ఏవైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి, అభిమానులు హాజరు కావాల్సిన అవసరమే వస్తే… చిల్లర గొడవలకు దిగే ఆస్కారం ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం. ఎందుకంటే, అదంతా టీడీపీ అభిమానులుండే ప్రాంతం. టీడీపీపై పవన్ కల్యాణ్ ఏ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారో తెలిసిందే. దేశ చరిత్రలో ఎన్నడూ లేని అవినీతి చంద్రబాబు హయాంలో జరిగినట్టు ఈ మధ్య మాట్లాడుతున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే టీడీపీ అభిమానులకు రుచించవు. తమ నాయకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తే… ఏ పార్టీ అభిమానులైనా సహజంగానే ఆగ్రహిస్తారు కదా. పవన్ ను విమర్శిస్తే జనసైనికులు కూడా హర్షించరు! సో… చుట్టూ టీడీపీ అభిమానులూ, ఆ పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా ఉండే అలాంటి ప్రాంతంలో జనసేనకు సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు జరిగితే.. సహజంగానే కొన్ని ఆటంకాలు ఎదురు కావొచ్చు! అయితే, ఈ ప్రత్యేక పరిస్థితిని పవన్ అర్థం చేసుకుని.. ఇంటిని పూర్తి వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించుకుని, రాజకీయ కార్యకలాపాలన్నీ కొత్తగా నిర్మితమౌతున్న కార్యాలయం నుంచి జరుపుకుంటే మంచిదే.