జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి భాజపా మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో మెహబూబా ముఫ్తీ సర్కారు కుప్పకూలింది. కాశ్మీరులో ప్రభుత్వం కూలిపోయాక.. తొలిసారిగా అక్కడ పర్యటించారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భాజపా ఎందుకు మద్దతు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే అంశంపై వివరణ ఇచ్చారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండే బదులు, ప్రతిపక్షంలో ఉండి పోరాడటమే మంచిదని భాజపా ఎందుకు భావించిందో చెప్పారు.
జమ్మూ కాశ్మీరు అభివృద్ధికి కట్టుబడి ప్రధాని మోడీ వేల కోట్లు నిధులు కేంద్రం నుంచి పంపించారనీ, కానీ భాజపా ఆశించిన అభివృద్ధి జరగలేదని అమిత్ షా చెప్పారు. ముఫ్తీకి మద్దతు ఇస్తున్నప్పుడు ప్రధానంగా కొన్ని షరతులు పెట్టామనీ.. జమ్మూ కాశ్మీరులో సమతుల అభివృద్ధి, శాంతిని నెలకొల్పడంలో నిరంతర ప్రయత్నం జరగాలి అనే అంశాల ప్రాతిపదిక మద్దతు ఇచ్చామన్నారు. కానీ, ఆ పరిస్థితి రానురానూ లేకుండా పోయిందన్నారు. ఇక్కడ పాత్రికేయులు హత్యకు గురయ్యారనీ, లోయలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయన్నారు. ఇంకోపక్క భాజపా ఆశించిన అభివృద్ధి కూడా కుంటుపడిందన్నారు. అభివృద్ధి జరగకపోతే అధికారంలో ఉండాల్సిన అవసరం ఏముందని భావించామనీ, ప్రతిపక్షంలో ఉండటమే సరైందని నిర్ణయించామన్నారు. అభివృద్ధి జరగకపోతే ప్రభుత్వంలో కొనసాగే అర్హతను భాజపా కోల్పోయినట్టే అన్నారు!
కాశ్మీరులో నిన్నమొన్నటి వరకూ భాజపా సంకీర్ణ సర్కారేగా అధికారంలో ఉండేది. మోడీజీ నిధులు కుమ్మరిస్తుంటే.. భాగస్వామ్య పక్షంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వారికీ ఉండాలి కదా! ఇప్పుడు తప్పంతా కేవలం పీడీపీదే అన్నట్టు అమిత్ షా మాట్లాడుతున్నారు. కాశ్మీరులో పాత్రికేయుల హత్య దారుణమని అమిత్ షా వ్యాఖ్యానిస్తుంటే అదోలా వినిపిస్తోంది..! ఇక, అభివృద్ధి జరగకపోతే అధికారంలో ఉండే అర్హత భాజపా కోల్పోయినట్టే అని చెప్పడమూ బాగుంది. కాకపోతే, ఈ సిద్ధాంతం కేవలం జమ్మూ కాశ్మీరుకి మాత్రమే పరిమితం చేస్తే ఎలా..? కేంద్ర ప్రభుత్వానికీ అప్లై చెయ్యాలి. కేంద్రం పాయింటాఫ్ వ్యూ నుంచి చూస్తే.. కాశ్మీరులో శాంతి నెలకొల్పడంతో భాజపా విఫలమైంది, అధికారంలో భాగస్వామ్య పక్షంగా అభివ్రుద్ధి చేయడంలోనూ విఫలమైంది, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో భాజపా విఫలమైంది, పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణలో విఫమైంది, రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది! ఇలా చెబుతూపోతే నాలుగేళ్ల మోడీ పాలనలో విజయాలు కన్నా వైఫల్యాల లిస్టే పెద్దది. మరి, అమిత్ షా చెప్పిన అభివృద్ధి థియరీ ప్రకారం భాజపా కేంద్రంలో అధికారంలో కొనసాగే అర్హత ఇంకా ఉన్నట్టా… ప్రతిపక్షంలో కూర్చుని పోరాడే అర్హతను సాధించినట్టా కాదా..?