తెలంగాణ రాష్ట్రసమితిలో నెంబర్ల ప్రస్తావన రాకపోయినా.. కేసీఆర్ తర్వాత అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేది హరీష్ రావే. హరీష్‌రావు సమర్థత తెలుసు కాబట్టే.. తెలంగాణ ఏ చిన్న ఎన్నిక వచ్చినా బాధ్యత ఆయనకే అప్పచెబుతారు కేసీఆర్. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావు.. కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం నిర్మాణాన్ని రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. రెండు మూడు రోజుల నుంచి హరీష్ రావు.. చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటున్నట్లు… విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా ప్రాజెక్టుల నిర్మాణం ఆగబోదని రాజకీయ ప్రకటలు చేసేస్తున్నారు.
నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ఏ విధంగా అడ్డుపడ్డారో.. హరీష్ రావు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. తాము ప్రాజెక్ట్‌ను శరవేగంగా నిర్మిస్తూంటే.. అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నారు. నిజానికి ఇప్పుడు కేంద్రంతో టీడీపీకి సన్నిహిత సంబంధాలు లేవు. ఉంటే గింటే టీఆర్ఎస్కే ఉన్నాయి. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు .. పోలవరంకు కూడా రానంత వేగంగా వచ్చేశాయి. చంద్రబాబు ఫిర్యాదు చేసినంత మాత్రాన.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయదు కదా..!. మరి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ఫిర్యాదుల పేరుతో… హరీష్‌రావు ఎందుకు రాజకీయ విమర్శలు ప్రారంభించారో ఎవరికీ అర్థం కావడం లేదు.
నిజానికి నదీ బోర్డుల మీటింగ్‌లలో… నీటి వాటాల కేటాయింపులపై.. ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి. కేటాయింపులు లేకుండా.. కడుతున్న ప్రాజెక్టులపై … ఏపీ అధికారులు ఎప్పటి నుంచో ఆయా బోర్డులకు, సంబంధించిన కేంద్ర సంస్థలకు నివేదికలు ఇస్తూనే ఉన్నారు. ఇదేమీ కొత్త కాదు. తెలంగాణ కూడా అదే చేస్తుంది. ఏపీలో కడుతున్న చాలా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఇలాంటి అభ్యంతరాలను ఎన్నింటినో వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇప్పుడు హరీష్‌రావు కొత్తగా రాజకీయం చేసే ప్రయత్నం చేయడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కోణంలో మాత్రం హరీష్ రావు ఈ విమర్శలు చేయడం లేదని.. కచ్చితంగా రాజకీయం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ కల్లా… కాళేశ్వరాన్ని పూర్తి చేసి నీళ్లిస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. నీళ్లిచ్చిన తర్వాత ఓట్లడుగుతానని కేసీఆర్ ఎన్నోసార్లు ప్రకటించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. దీనికి కారణంగా చంద్రబాబును చూపిస్తేనే ఎక్కువ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందన్న లెక్కలతోనే హరీష్ రావు.. చంద్రబాబుపై దృష్టి సారంచారంటున్నారు. ఇదే నిజమైతే.. మరోసారి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో.. రాజకీయ నేపధ్యంగా.. ఏపీ వర్సెస్ తెలంగాణ అనే అంకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.