తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తామని… కాంగ్రెస్ నేతలు నోటి మాటలను అసువుగా చెప్పేస్తూంటారు. దాని కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా.. అంటే… ఒక్కటంటే.. ఒక్క శాతం కూడా… ఆ దిశగా ప్రయత్నాలుండవు. ఎవరైనా పార్టీ నుంచి వెళ్తున్నారా అంటే… వెళ్లగొట్టడానికి పాతిక మంది రెడీగా ఉంటారు. అదే.. ఎవరైనా పార్టీలోకి వస్తున్నారా అంటే.. ఆపడానికి ముఫ్పై మంది సిద్ధమైపోతారు. దానం నాగేందర్ పార్టీకి గుడ్ బై చెప్పే విషయంలో జరిగింది ఇదే. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీలో పరిస్థితిని ఏకతాటిపైకి వచ్చి చక్క దిద్దుకోవాల్సింది పోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ చలి కాచుకుంటున్నారు.
దానం నాగేందర్ చాలా రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనను బుజ్జగించి క్రియాశీలం చేసే ప్రయత్నాలు చేయలేదు. అలా వదిలేశారు. చివరికి ఆయన టీఆర్ఎస్తో మాట్లాడుకుని రాజీనామా లేఖలు పంపిన తర్వాత నిద్రలేచారు. కీలకమైన నేత కాంగ్రెస్‌ను వీడిపోతున్నట్లు కొంత మంది సమావేశాలు నిర్వహించారు. మరికొంత మంది… నేతల వలసలను ముందస్తుగా పసిగట్టి ఆపే ప్రయత్నాలు కూడా టీపీసీసీ నాయకత్వం చేయలేకపోతోందని ఢిల్లీకి ఫిర్యాదులు పంపారు. గ్రేటర్ లో బలమైన నేతగా ఉన్న నాగేందర్ టీఆర్ఎస్తో టచ్ లోకి వెళ్లారన్న కనీస సమాచారాన్ని కూడా తెలుసుకోలేకపోవడం కాంగ్రెస్ బలహీనతను బట్టబయలు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో ఆశలు పెట్టుకున్న రాష్ట్రం తెలంగాణ. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటు అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ సమయంలో నేతలు వరుసకట్టి వలసలు పోవడం, వర్గవిభేదాలతో నేతలు కొట్టుకోవడం అసలుకే ఎసరు తెస్తోందని హైకమాండ్ కంగారు పడుతోంది. అందుకే తెలంగాణ వ్యవహారాలపై రాహుల్ ఏకంగా వార్‌రూమ్ భేటీ నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన సందర్భాల్లో మాత్రమే వార్ రూమ్ భేటీలను కాంగ్రెస్‌లో నిర్వహిస్తూంటారు.
ఈ భేటీలో పార్టీని పటిష్టం చేయడానికి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన తరుణంలో త్వరలో ఏఐసీసీ దూతలను రాష్ట్రానికి పంపి రిపోర్టులు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ నివేదికలు తెలంగాణ కాంగ్రెస్‌ను కాపాడటం కష్టమేనన్న అభిప్రాయాలున్నాయి. నేతలు.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు కాకుండా.. పార్టీ కోసం పని చేసినప్పుడు మాత్రమే మంచి రోజులొస్తాయని కాంగ్రెస్ ఫ్యాన్స్.. బిగ్గరాగనే చెబుతున్నారు..కానీ పట్టించుకునేవారేరీ..!