ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయడం లేదంటూ… తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి… సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. అప్పుడప్పుడూ ఆ పిటిషన్ విచారణకు వస్తోంది. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడంతో..ఇది కాస్తంత హైలెట్ అయింది. ఆ అఫిడవిట్లో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో….ఏపీలో అదో పెద్ద రాజకీయ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా … ఆంధ్రప్రదేశ్ కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని వివరిస్తూ.. పాయింట్ టు పాయింట్… ఏ ఒక్క హామీని కేంద్రం అమలు చేయలేదని… పూర్తి పత్రాలను కోర్టుకు సమర్పించింది.
ఆంధ్రప్రదేశ్ చేసిన పని కరెక్టేనా అన్న ప్రశ్న కూడా.. జోరుగానే వినిపిస్తోంది. కేంద్రం చేసిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు ద్వారా దేశం ముందు పెట్టడం మంచి నిర్ణయమే. కానీ… విభజన చట్టంలో ఉన్న పదజాలం వల్ల .. న్యాయవ్యవస్థ ముందు బలమైన వాదనలు వినిపించడానికి సాధ్యమవుతుందా అన్న ప్రశ్న నిపుణుల్లో వస్తోంది. ఏ ఒక్క హామీ విషయంలోనూ… విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే సాంకేతిక కారణాల పేరుతో కోర్టులో ఇబ్బందులొస్తాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణకు ప్రత్యేకహోదా ఇస్తామని ఇవ్వలేదని.. ఆంధ్రప్రదేశ్ అఫిడవిట్లో పేర్కొంది. నిజానికి ఇది.. రాజ్యాసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ మాత్రమే. కాంగ్రెస్ చట్టంలో పెట్టలేదు. చట్టంలో పెట్టమని బీజేపీ కూడా ఒత్తిడి చేయలేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమి చేయలగరు..?
అదే కాదు.. ప్రధానమైన విభజన హామీలన్నింటినీ.. విభజన చట్టంలో పరిశీలించాలనే ఉంది. కానీ స్పష్టంగా ఏర్పాటు చేయాలని లేదు. ఏర్పాటు చేయాలని ఏ చట్టంలోనూ చెప్పరు. అది కేంద్రానికి తెలుసు. సాధ్యసాధ్యాలను పరిశీలించి..అడ్డంకులను అధిగమించి.. ఆయా హామీలను నెరవేర్చాలన్నదే.. చట్టం ఉద్దేశం. కానీ కేంద్రం ఇప్పుడు… ఆ సాంకేతిక పరిభాషనే..తనకు అన్వయించుకుని… పరిశీలిస్తూనే ఉన్నామని చెబుతోంది. దానికి ఓ టైం లిమిట్‌ను చట్టంలో ఎక్కడా చెప్పలేదు. మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి రూలింగ్ ఇవ్వగలదు..?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమి అడిగినా… వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని కేంద్రం తప్పించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. విభజన హామీల విషయంలో ఇప్పటి వరకూ.. కేంద్రాన్ని నేరుగా ఏపీ నిలదీస్తోంది. ఇప్పుడు ఏపీనే స్వయంగా సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో..కేంద్రానికి కూడా ఓ అవకాశం దొరికినట్లయింది. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. కోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పే వెసులుబాటు లభించినట్లయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కారణం ఏమైనా కానీ.. తెంలగాణ ప్రభుత్వం మాత్రం.. పొంగులేటి పిటిషన్‌ను కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు.