తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అరడజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు. పీసీసీ అధ్యక్ష పీఠం కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నవారు కొంతమంది ఉన్నారు! తమ వంతు వచ్చే వరకూ ఆగి చూడటం ఒకెత్తు, వంతు రావడం కోసం ఇతరులపై ఫిర్యాదు చేసి, పరిస్థితిని అనుకూలంగా మార్చాలనుకోవడం మరో ఎత్తు! ఈ రెండో టైప్ ఎత్తుగడలు వేసేవారే టి. కాంగ్రెస్ లో ఎక్కువ. ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లిపోవడం, హైకమాండ్ ముందు ఫిర్యాదు చేయడం, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి గోడు వెళ్లగక్కుకోవడం అనేది టి. కాంగ్రెస్ లో ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. అయితే, ఇకపై ఈ వ్యవహారాలకు చెక్ పెట్టాలని ఏఐసీసీ కాస్త బలంగానే నిర్ణయించుకున్నట్టుంది. అందుకే, రాష్ట్ర నేతలకు సున్నితంగా క్లాస్ తీసుకున్నారు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా.
ఇప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చే ఆలోచన లేని మరోసారి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల వరకూ ఆయనే కొనసాగుతారనీ, ఆయన్ని మారుస్తారంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కుంతియా చెప్పారు. ఉత్తమ్ నాయకత్వంలోనే అందరూ పనిచేయాల్సి ఉంటుందన్నారు. పార్టీలో సమస్యలు ఏవైనా ఉంటే తనతో నిరభ్యంతరంగా నాయకులు పంచుకోవచ్చన్నారు. నేరుగా రాహుల్ గాంధీని కలిసి చెప్పాలనుకున్న ఇష్యూస్ ని కూడా తనకు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు! పార్టీ అంతర్గత సమస్యల గురించి మీడియా ముందుక వెళ్లి మాట్లాడొద్దన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ నుంచి బయటకి వెళ్లేవారి గురించి తామేమీ ఆలోచించేది లేదని చెప్పారు.
ఈ మాటల్లోనే ఇవ్వాల్సిన వార్నింగులన్నీ ఇచ్చేశారు! రాహుల్ గాంధీ దగ్గరకి ఫిర్యాదులతో వెళ్లొద్దని పరోక్షంగా మండిపడ్డారు. నేతలంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుందనీ, వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టాల్సి ఉంటుందనీ హెచ్చరించినట్టే. ఇప్పుడు సమస్యంతా ఇదే కదా.. ఉత్తమ్ నేతృత్వంలో నడిచేందుకు కొంతమంది సిద్ధంగా లేరు. ముఖ్యంగా కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. సో.. వారికీ పడాల్సిన క్లాస్ పడిపోయినట్టే! ఇప్పటికీ పీసీసీ తమకే దక్కుతుందని కలలు కంటున్నవారికి కూడా చెక్ పెట్టేశారు. కుంతియా తీసుకున్న ఈ క్లాస్.. ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. క్షేత్రస్థాయిలో టి. పార్టీ పటిష్టత కంటే, అంతర్గతంగా పార్టీని బలోపేతం చేయడమే హైకమాండ్ పెద్ద సమస్యలా మారినట్టు కనిపిస్తోంది. కుంతియా వ్యాఖ్యల్లో అర్థమౌతున్న ఆందోళన కూడా ఇదే కదా!