మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన అనుచరులతో పలుమార్లు సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చేశారు. టీడీపీ ఇమడలేకపోతున్నామనీ, ఆశించిన ప్రాధాన్యత దక్కలేదన్నదే ఆయన అసంతృప్తి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకూ తీసుకెళ్లారు. కొన్నాళ్లు ఓపిక పట్టాలంటూ ఆయన సూచించారు. అయినా, ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల తొలివారంలో వైకాపా చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. అయితే, ఆయన్ని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదనే అనిపిస్తోంది. అందుకే చివరి ప్రయత్నంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో రాయబారం పంపినట్టు సమాచారం.
శనివారం రాత్రి ఆనం ఇంట్లో ప్రత్యక్షమయ్యారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కాసేపు వీరిద్దరూ చర్చించుకున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే ఆనంను కలిసేందుకు గంటా వెళ్లారంటూ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చివరి ప్రయత్నంగా ఆయన్ని కలిసి.. పార్టీలో కొనసాగాల్సిందిగా బుజ్జగించే ప్రయత్నం గంటా ద్వారా చేశారని అంటున్నారు. అయితే, తాను టీడీపీలో ఇమడలేననీ, ఏమీ అనుకోవద్దని ఆనం అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఆనం స్పందిస్తూ… దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతా లేదని ఆయన చెప్పారు. తనతో గంటాకు ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్లనే ఆయన వచ్చారనీ, తన సోదరుడు మరణించాక పరామర్శించడానికి ఆయన వచ్చారన్నారు. దీన్లో బుజ్జగింపులూ రాయబారాలు లాంటివి లేవన్నట్టు ఆయన కొట్టి పారేశారు.
పార్టీ ఆదేశాల్లేకుండా గంటా ఎందుకు వెళ్తారు..? ఎలాగైనా ఆనంను పార్టీ వీడి వెళ్లకుండా ఆపాలాలని టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. దాన్లో చివరి ప్రయత్నమే ఈ బుజ్జగింపులు అనుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందంటున్నారు. పైగా, టీడీపీలో ఇమడలేకపోతున్నానని ఆనం కారణం చెబుతున్నారు. ఇమడలేకపోవడం అంటే ఏమిటనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. పదవి రాకపోవడం వల్ల ఇమడలేకపోతున్నారా, లేదంటే స్థానిక లేదా రాష్ట్ర నాయకత్వం తీరు వల్ల ఇమడలేకపోతున్నారా అనేది ఆయన స్పష్టం చేయాల్సి ఉంది. మరి, ఆయనకి వైకాపా చేరితే అక్కడ ఇమిడే పరిస్థితులు ఉంటుందా అనేది కూడా ప్రశ్నే. ఏదేమైనా, ఆనం బుజ్జగింపు పర్వంలో చివరి ప్రయత్నం కూడా అయిపోయినట్టే.