పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమది అని కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గట్కరీ హామీ ఇచ్చారు. కానీ, ఇది ఎప్పటి మాట.. గత ఏడాది డిసెంబర్ లో ఇచ్చిన మాట! అప్పుడు కూడా పోలవరం పనులపై కేంద్రమే మోకాలడ్డుతుంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి గట్కరీని కలుసుకున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అనీ, ఆంధ్రా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2019లోపే పూర్తి చేస్తామనీ, ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత ఆందోళనతో ఉన్నారో, తామూ అదే భావనతో ఉన్నామని గట్కరీ చెప్పారు. సరే, చెప్పిననాటి నుంచి నేటివరకూ కేంద్రం చూపిన చొరవ ఏపాటిదో కనిపిస్తూనే ఉంది! కానీ, ఇప్పుడు కొత్తగా ఆ పాత మాటను మరోసారి గుర్తు చేశారు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
పార్టీ నేతలతో కలిసి పోలవరం సందర్శించారు కన్నా. ఈ సందర్బంగా మీడియాతో కన్నా మాట్లాడుతూ… పోలవరం నిర్మాణ బాధ్యత తమదనీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా తామే కడతామన్నారు. ఇదే మాటను గట్కరీ చెప్పారని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతీ పైసా ఇస్తామని చెప్పిన తరువాత కూడా దాని గురించి టీడీపీ విమర్శించడం సరైంది కాదన్నారు. ప్రాజెక్టు విషయంలో ఉన్న సమస్యల్ని త్వరతిగతిన పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగిందనీ, భూసేకరణ, హెడ్ వర్క్స్ లో అవినీతి జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా పోలవరం కడతామని కన్నా చెప్పడం హాస్యాస్పదం! ఎందుకంటే, కేంద్రమే పోలవరానికి సహకరించడం లేదు. ఎప్పటికప్పుడు అడ్డంకులు పెడుతున్నదే కేంద్రం. జాతీయ ప్రాజెక్టు అంటారు, ప్రతీ పైసా తామే ఇస్తున్నామంటారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుల చెల్లింపులపై తాత్సారం చేస్తారు. అవినీతి జరుగుతోందీ జరుగుతోందీ అని ప్రతీసారీ ఆరోపించడం ఎందుకూ..? ఎలాగూ జాతీయ ప్రాజెక్టే కదా… నిర్మాణ బాధ్యత వారికీ ఉందని పదేపదే చెప్పుకుంటున్నారు కదా, అలాంటప్పుడు వారే ఎంక్వయిరీ చేయించుకోవచ్చుగా. అవినీతి జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణ బాధ్యతల నుంచి తప్పించుకోవచ్చు. స్వయంగా వారే నిర్మించుకోవచ్చు… ఎవరు కాదంటున్నారు..? అయినా, పోలవరం నిర్మిస్తామని గట్కరీ చెప్పారు, ప్రధాని అన్నారు, కట్టుబడి ఉన్నారు, నడుం బిగిస్తున్నారు అంటూ ఇంకెన్నాళ్లు చెబుతారు..? పోలవరం పూర్తికి కేంద్రం నుంచి జరుగుతున్న అనూహ్య ప్రయత్నం ఏంటో కన్నా వివరిస్తే బాగుంటుంది.