కడపలో ఉక్కు కర్మాగారం సాధన దిశగా కేంద్రంపై ఏపీ సర్కారు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. కడపలో ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణం తెలుగుదేశం నేతల తీరే అని విమర్శించారు. ప్రజలకు క్లీన్ గవర్నెన్స్ ఇస్తుందన్న నమ్మకంతోనే తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చానని మరోసారి చెప్పారు! అది జరగకపోవడంతోనే ప్రభుత్వంతో విభేదించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రకరకాలుగా దోచుకోవడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదన్నారు.
కడపలో ఉక్కు కర్మాగారం ప్రారంభిస్తామని గతంలోనే జిందాల్ కంపెనీ ముందుకొచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గరుందన్నారు. దాన్ని ప్రభుత్వ పెద్దలే అడ్డుకున్నారని జిందాల్ కి చెందినవారే చెప్పారన్న సమాచారం తనకు తెలిసిందన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ కావాలని టీడీపీలో ఎవరైతే గోల చేస్తున్నారో.. వాళ్లే అడ్డుకున్నారన్నారు! ఎందుకంటే, వాళ్లకి అనుకూలమైన విధివిధానాలు లేకపోవడంతో వ్యతిరేకించారని ఆరోపించారు. వాళ్లకు అనుకూలమైన వ్యక్తులు, వారికి ప్రయోజనాలు ఉంటేనే ఫ్యాక్టరీలు ముందుకు వెళ్తున్నాయనీ.. టీడీపీ వాళ్లకి ప్రయోజనాలు రాలేదు కాబట్టే ఇప్పుడు గోల చేస్తున్నారని పవన్ అన్నారు. టీడీపీ నేతలకు లబ్ధి చేకూరితే.. వెంటనే వాళ్లు ఒప్పేసుకుంటారని కూడా ఎద్దేవా చేశారు. అభివృద్ధి అనేది సహజంగా జరగడానికి ఉండాల్సిన పరిస్థితులు లేవన్నారు. అభివృద్ధికి అనువైన పరిస్థితులు కల్పించాల్సినవారే వాటాలు కోరుకుంటూ ఉంటే ఎలా అని ప్రశ్నించారు.
ఈ పరిస్థితులను మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు! ఆ కృషి ఏంటనేది కూడా చెబితే బాగుండేది.. ప్రస్తుతానికి చెప్పలేదు. అయితే, ఇక్కడ పవన్ వదిలేస్తున్న అంశం ఏంటంటే… ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పింది కేంద్రం తీరు! దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. నాలుగేళ్లు గడిచినా కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికీ ఒక స్పష్టమైన విధివిధాన ప్రకటన కేంద్రం చేయలేకపోయింది. అది చాలదన్నట్టు… కడపలో ఫ్యాక్టరీ ఏర్పాటు అసాధ్యమనీ భాజపా చెప్పింది. దీంతో నిరసనలు మిన్నంటే సరికి.. కట్టి తీరతారమంటూ భాజపా నేతలు మాట మార్చారు.
కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి భాజపా తీరుపై పవన్ స్పందిస్తే బాగుంటుంది. ఇవ్వాల్సిన కేంద్రం బాధ్యతను ప్రశ్నించకుండా… ప్రయత్నిస్తున్న రాష్ట్ర సర్కారుపైనే పవన్ కూడా విమర్శలు చేయడం గమనార్హం! ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో అందరూ కేంద్రం తీరునే తప్పుబడుతుంటే.. ఆ టాపిక్కే పవన్ మాటల్లో లేదు. పైపెచ్చు, వాటాలు కుదర్లేదనీ, కుదిరితే దీక్షలుండవని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.