భారతదేశంలో నోట్ల రద్దు అనేది ఇప్పటికి చాలా పెద్ద మిస్టరీ. అసలు “ఈ డిమానిటైజేషన్” ఎందుకు చేశారనేది..ఎవరికీ అర్థం కాలేదు. ప్రధాని మోదీ… బ్లాక్‌మనీని కట్టడం చేయడం దగ్గర్నుంచి… డిజిటల్ లావాదేవీలు పెంచడం వరకూ.. పదుల కారణాలు చెప్పారు. కానీ అసలు వాస్తవమేదో ఎవరికీ తెలియదు. అసలు నిజం మాత్రం.. బ్లాక్‌మనీ అనేది లేదని తేలడం.. చెలామణిలో ఉన్న నగదు మొత్తం బ్యాంకులు చేరింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
ఇప్పడిప్పుడే నోట్ల రద్దు తర్వాత జరిగిన కొన్ని వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అమిత్ షాది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా డైరెక్టర్‌గా ఉన్న అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో ఐదు రోజుల్లో ఏకంగా రూ.745.58 కోట్ల డబ్బు డిపాజిట్‌గా వచ్చి చేరింది. ఇదొక్కటే కాదు.. గుజరాత్‌లోని 11 బ్యాంకులకు ఐదు రోజుల్లో వచ్చిన డిపాజిట్లు రూ.3,118కోట్లు. ఈ బ్యాంకులన్నింటికీ.. బీజేపీ నేతలే చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఉన్నారు. ఐదు రోజుల తర్వాత దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్లను డిపాజిట్లుగా తీసుకోవడాన్ని కేంద్రం నిషేధించింది. ఈ బ్యాంకుల డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ ప్రకటించలేదు. ఓ ఆర్టీఐ కార్యకర్త దీన్ని బయటపెట్టారు. గుజరాత్‌లోని రెండు పెద్ద డీసీసీబీల్లో దేశంలోనే అత్యధికంగా రద్దయిన నోట్లు డిపాజిట్ అయ్యాయని ఆయన బయపెట్టారు.
ఇక్కడ ఇంకో విశ్లేషణ కూడా బీజేపీపై అనుమానాలను రేకెత్తిస్తోంది. నోట్ల రద్దు సమయంలో రూ.22,270 కోట్ల విలువైన రద్దయిన నోట్లు సహకార బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. ఇందులో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని సహకార బ్యాంకుల్లో 14,293 కోట్లు జమ అయ్యాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇది కేవలం రూ.7,977కోట్లకే పరిమితమైంది. కొత్తగా బయటకు వచ్చిన ఈ వ్యవహారాలపై… కాంగ్రెస్ పార్టీ .. బీజేపీపై విమర్శలు ప్రారంభించింది. ముందు ముందు నోట్ల రద్దుకు సంబంధించిన మరిన్ని అనుమానాస్పద లావాదేవీలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఇది కీలక పరిణామమే..!