దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి టీఆర్ఎస్ విజయంపై ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని.. సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధానమంత్రితో అంతకు ముందే సమావేశం అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన … ముందస్తు కసరత్తులో మునిగిపోయారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆక్టోబర్ డెడ్‌లైన్ అధికారులకు విధించారు. రెండో విడత పెట్టుబడి సాయం కిందట.. ఎకరాకిని రూ. 4వేలు. అక్టోబర్‌లోనే పంపిణీకి ఏర్పాట్లు చేయమని ఆదేశించారు కూడా.
కేసీఆర్ దూకుడు చూసిన వారంతా.. మోడీ నుంచి.. ముందస్తు ఎన్నికలపై గట్టి సూచనలే అందుకున్నారని.. నమ్మడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా.. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బహిరంగంగా మాట్లాడిన తొలి సమావేశంలోనే చాలా ఫోర్స్‌గా ముందస్తు సూచనలు ఇచ్చారు. కాంగ్రెస్‌కు సవాల్ చేశారు. టీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే అయినా వెంటనే కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే.. ఈ రోజే అసెంబ్లీని బర్తరఫ్ చేసి ఎన్నికలకు రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ మీద కోమటిరెడ్డి.. మిగతా కాంగ్రెస్ నేతలందరి కంటే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే.. కోమటిరెడ్డి ఎమ్మెల్యే హోదాపై.. కేసీఆర్ రాత్రికి రాత్రే అనర్హతా వేటు వేయించేశారు. కోర్టులు చెప్పినా.. మళ్లీ ఆ ఎమ్మెల్యేహోదా ఇవ్వడానికి సిద్ధంగా లేరు.
కోమటిరెడ్డితో పాటు పొన్నం లాంటి నేతలు కూడా.. ముందస్తుకు సిద్ధమని కేసీఆర్‌కు సవాల్ చేశారు. మొత్తానికి దేశంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది..కానీ తెలంగాణలో అది కాస్త ఎక్కువగానే ఉంది. దానికి కారణం.. కేసీఆర్ ముందస్తుగా ఎన్నికలపై కసరత్తు ప్రారంభించేయడమే. ప్రతిపక్షాలకు సవాళ్లు విసరడమే. తెలంగాణ ఇచ్చి మరీ… తాము ఓడిపోవడం ఏమిటనుకుంటున్న కాంగ్రెస్.. ఎంత త్వరగా కేసీఆర్‌పై దండెత్తడానికి అవకాశం వస్తుందా.. అని ఎదురు చూస్తోంది. కేసీఆర్ దూకుడు చూస్తూంటే… కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెవిలో చెప్పారేమోనన్న ఊహాగానాలు.. జోరుగానే వినిపిస్తున్నాయి.