మెగా ఇంటి నుంచి ఇప్పుడు మరో హీరో వచ్చాడు. కల్యాణ్‌దేవ్ రూపంలో. చిరు అల్లుడు ‘విజేత’తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ఓ విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. ఇదో ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అని. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్నీ, వాళ్ళ సంఘర్షణనీ తెరపై చూపించబోతున్నారు. ఓ విధంగా సెంటిమెంట్ బాగా దట్టించిన సినిమా ఇది. మెగా ఫ్యామిలీ అనే కాదు, సాధారణంగా హీరోల డెబ్యూ సినిమాలు గమనిస్తే.. లవ్ స్టోరీలో, లేదంటే మాస్ యాక్షన్ డ్రామాలో కనిపిస్తుంటాయి. తొలి సినిమాలోనే తమకు తెలిసిన విద్యలన్నీ చూపించేయాలన్న తాపత్రయం కనిపిస్తుంది. కానీ కల్యాణ్ దేవ్ ఎంట్రీ మాత్రం అందుకు భిన్నంగా సాగబోతోంది. సెంటిమెంట్ దట్టించిన ఈ సినిమాలో కల్యాణ్ దేవ్.. ఓ మధ్యతరగతి కుర్రాడిగా కనిపించబోతున్నాడు. మాస్, యాక్షన్ అంశాలు ఈ సినిమాలో తక్కువే కనిపిస్తున్నాయి. దానికి తోడు.. మురళీ శర్మ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది. క్లైమాక్స్ అంతా… మురళీ శర్మే నడిపించాడని ఆడియో వేడుకలో ప్రముఖ నటుడు నాజర్ క్లూ కూడా ఇచ్చేశాడు. దాన్ని బట్టి చూస్తుంటే.. కల్యాణ్ దేవ్ తన కెరీర్‌ని స్లో, అండ్ స్లడీ అనే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే ఈ తరహా కథతో తన ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదీ ఓ రకంగా మంచి పద్ధతే. కథాబలమున్న సినిమాల్లో నటిస్తూ… నటిస్తూ. ఎప్పుడైనా అవసరానికి తగిన హీరోయిజం చూపించుకుంటూ మెల్లమెల్లగా అలవాటు పడడం కల్యాణ్ కెరీర్‌కి మేలే చేస్తుంది. మొదటి సినిమాలోనూ ‘నేను పోటుగాడ్ని సుమా’ అంటూ డాంభికాలు పోకుండా క్లీన్ కథని ఎంచుకోవడం ఓరకంగా ప్లస్ పాయింట్. బహుశా ఇదంతా చిరు గైడెన్స్ అయి ఉంటుంది. 150 సినిమాలు చేసిన హీరో, అందులోనూ దశాబ్దాలుగా పరిశ్రమని చూస్తున్నాడు. తన అల్లుడు ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వాలో ఆయనకు తెలీదా..??