కడపలో ఉక్కు పరిశ్రమ సాధన దిశగా ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న దీక్ష ఆరో రోజుకి చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఈ దీక్షపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల ద్వారా నిరసన కార్యక్రమాలు పెంచాలంటూ ఆయన సూచించారు. దీన్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలకు పిలుపునిచ్చారు. బుధవారం నాడు కొన్ని జిల్లాలో ధర్నా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఏపీతో పాటు ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 28న దేశ రాజధానిలో టీడీపీ ఎంపీలతో ధర్నా కార్యక్రమం కూడా ఉంటుందని తెలుస్తోంది.
ఉక్కు కర్మాగారం విషయమై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని టీడీపీ డిసైడ్ అయినట్టుగా ఉంది. ఇతర పార్టీల వైఖరిని ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతోంది. ఇంకోవైపు గాలి జానర్థన్ రెడ్డి వ్యాఖ్యల సంగతి తెలిసిందే. గతంలో తాను పెట్టిన ఖర్చును తిరిగి ఇవ్వాలనీ, లేదంటే తానే ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభిస్తానని ఆయన కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం అంశమై ఉద్యమం తీవ్రతరమౌతున్న తరుణంలో ఇలాంటి ప్రకటనల వెలువడుతూ ఉండటం, దీన్లో కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో ఈ స్థాయిలో నిరసనలు వ్యక్తమౌతుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా పెద్దగా స్పందిస్తున్న పరిస్థితి లేదు. సొంత జిల్లా కడపకు సంబంధించిన వ్యవహారమే అయినా ప్రతిపక్ష నేత జగన్ కూడా ఫ్యాక్టరీ అంశాన్ని లైట్ గా తీసుకుంటున్న పరిస్థితి. అంతేకాదు, ఫ్యాక్టరీ ఆలస్యానికి కారణం చంద్రబాబు తీరే అనే అసంబద్ధ వాదనతోనే వైకాపా నేతలు కొందరు స్పందిస్తున్నారు. అంతేతప్ప, ఇవ్వని కేంద్రాన్ని నిలదీయడం లేదు.
వీటన్నింటినీ ప్రజలకు వివరించడంతోపాటు, కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసేందుకు టీడీపీ కార్యాచరణ సిద్ధం చేసుకుందని సమాచారం. దీన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలంటూ పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీ అంశమే ఇప్పటికే ప్రధానికి చంద్రబాబు ఓ లేఖ రాశారు. విభజన హామీల్లో ఉన్న అంశాన్నే తాము నెరవేర్చమన్నామనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరసనలు నిర్వహించడంతోపాటు, జాతీయ స్థాయిలో కూడా దీనిపై ఇతర పార్టీల మద్దతును టీడీపీ కోరే అవకాశం కనిపిస్తోంది.