రానాకీ కేటీఆర్కీ మధ్య ఉన్న అనుబంధం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ మంచి మిత్రులు. ఆ స్నేహంతోనే ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు కేటీఆర్. పైగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తెలంగాణ బిడ్డ. ఆ కోటాతో… ఈ సినిమాపై కేటీఆర్‌కి మరింత ప్రేమ పెరిగింది. కాకపోతే ఈ ఫంక్షన్‌కి రావడానికి కేటీఆర్ ఓ షరతు విధించాడట. ఫంక్షన్లో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులంతా చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పాడట. దానికి టీమ్ మొత్తం అంగీకరించిందట. తీరా చూస్తే… కొంతమందే ఆ షరతు పాటించార్ట. ”తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రతీ సోమవారం మేమంతా చేనేత దుస్తులనే ధరిస్తున్నాం. ఈ వేడుక కూడా సోమవారమే జరుగుతోంది కాబట్టి.. ఈ ఫంక్షన్లో పాల్గొనేవాళ్లంతా చేనేత వస్త్రాలు ధరించి రావాలని చెప్పాను. దానికి సరే అన్నారు. కాకపోతే ఇక్కడ చీటింగ్ జరిగింది. కొంతమందే ఆ దుస్తుల్లో కనిపిస్తున్నారు. అయినా ఫర్వాలేదు. ఇలాగైనా ఈ రంగాన్నిప్రోత్సహిస్తున్నందుకు ఆనందంగా ఉంది” అన్నాడు కేటీఆర్. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్ చూసి కేటీఆర్ కంగారు పడ్డాడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. ”పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేస్తున్నా. వర్సాకాలం వచ్చిందంటే ఈ నగరానికి ఏమైంది అని హెడ్డింగులు పెడుతుంటారు. ఈ సినిమా కూడా అలాంటిదేనేమో అనిపించింది. కానీ కాదని తెలిసింది” అంటూ కాస్త చమత్కరించాడు కేటీఆర్. పెళ్లి చూపులు తనకు బాగా నచ్చిందని, ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించి, ఆశీర్వదించి వెళ్లాడు.