భారతీయ జనతా పార్టీ ఇంత కాలం… ప్రజల్లోకి ఎక్కించిన హిందూత్వ భావజాలం ఎంత వికృతంగా ఉంటుందో.. ఇప్పుడు ఆ పార్టీ నేతలకే అర్థమవుతోంది. హిందూత్వం అంటే అదో జీవన విధానమని.. మతం కాదని వెంకయ్యనాయుడు లాంటి కరుడుగట్టిన ఆరెస్సెస్ వాదులు చెబుతూంటారు కానీ… బయట బీజేపీ నేతలు అర్థం చేసుకునేది.. ప్రజల్లోకి ఎక్కించేది వేరు. అది ఎలాంటిదో.. ఎంత వికృతంగా ఉంటుందో… ప్రత్యక్షంగా అనుభవిస్తే కానీ తెలియదు. ఇప్పుడు అనుభవాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రుచి చూశారు. ఓ వ్యక్తి అత్యంత దారుణంగా.. “ఇటీవల మీకు ఒక ముస్లిం వ్యక్తి కిడ్నీని అమర్చారు… అందుకే మీరు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు” అని విమర్శించేశారు. కొద్ది రోజుల క్రితం.. సుష్మస్వరాజ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. అది ఎవరి కిడ్నీ.. అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ వ్యక్తి మాత్రం సుష్మస్వరాజ్ కిడ్నీకి మతం అంటగట్టేసి.. నానా మాటలనేశాడు.
సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే సుష్మస్వరాజ్.. తనకు ఎవరైనా సమస్యలు ట్వీట్ చేస్తే..స్పందిస్తూంటారు. అలాగే లక్నోకు చెందిన ఓ జంట… ఆమె మంత్రిత్వ శాఖ పనితీరుపై ఫిర్యాదు చేశారు. హిందూ-ముస్లిం జంట అయిన వారిద్దరూ పాస్‌పోర్ట్ కోసం వెళ్తే.. అక్కడి పాస్‌పోర్ట్ ఆఫీసర్ .. మతం పేరుతో కించ పరిచి.. అప్లికేషన్‌ను తిరస్కరించారు. పేరు మార్చుకోవాలంటూ.. ముస్లిం యువకుడికి సూచించాడు. ఈ విషయంపై సదరు జంట..సుష్మాకు ట్వీట్ ద్వారా కంప్లైంట్ చేశారు. ఇది మీడియాలో హైలెట్ అయింది. వెంటనే సుష్మాస్వరాజ్ సదరు పాస్‌పోర్ట్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించి వారికి పాస్‌పోర్ట్ వచ్చేలా చేశారు. ఇదే సోకాల్డ్ హిందుత్వ వాదులకు కంటగింపుగా మారింది. అప్పట్నుంచి ఓ వర్గం.. ఆ జంట పెళ్లి చేసుకోవడమే తప్పన్నట్లుగా వాదించడం ప్రారంభించింది. వీరంతా.. బీజేపీ సపోర్టర్లు.
సుష్మ ఇలా చేసినందుకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. వీరందరి రంగు కాషాయమే. బీజేపీ నేత ఎవరైనా సరే.. ముస్లింలకు ఎలాంటి పని చేయకూడదన్నట్లు వీరు వ్యవహరిస్తున్నారు. నిజానికి సుష్మాస్వరాజ్ వారికి ఎలాంటి సాయమూ చేయలేదు. పాస్‌పోర్ట్ రూల్స్ ఉల్లంఘించిన అధికారికి సరైన శిక్షే వేశారు. ఈ దేశంలో హిందూ-ముస్లిం పెళ్లి చేసుకోకూడదనే రూల్ లేదు. పెళ్లి చేసుకున్నా.. ఎవరో ఒకరు మతం మారాలనే నిబంధన అంత కంటే లేదు. కానీ బీజేపీ పేరు చెప్పుకుని అసహనంతో రగిలిపోయేవారు మాత్రం.. తమ ఆగ్రహాన్ని సుష్మాస్వరాజ్‌పై ఏ మాత్రం దాచుకోవడం లేదు. ఆమె కిడ్నీకి కూడా మతం అంటగట్టేసి రాక్షసానందం పొందుతున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా జోరుగా చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. జోక్యం చేసుకుంది. సుష్మాస్వరాజ్‌కు మద్దతు పలికింది. సుష్మ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నప్పటికీ.. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేం ప్రశంసిస్తున్నాం అని ట్వీట్ చేసింది. నిజానికి బీజేపీ నేతలు సిగ్గుపడాల్సిన విషయం… ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన విషయం. తమ విధానాలతో.. ఎంత విద్వేషం పెంచి పోషిస్తున్నారో.. అంచనా వేసుకోవాల్సిన విషయం.