మళ్లీ ఎప్పటిలాగానే జరిగింది.. ఆగ్రహావేశాలు తారస్థాయికి చేరిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోడీ హెచ్సియు విద్యార్థి వేముల రోహిత్ మృతికి విచారం ప్రకటించారు. బిజెపి స్థానిక నేతలు, సంబంధిత కేంద్ర మంత్రులు చాలామంది కంటే సూటిగానే ఆయన మాట్లాడారు. ఇంతకు ముందు అమీర్ ఖాన్ విషయంలోనూ.. ఢిల్లీలో చర్చీలపై దాడుల విషయంలోనూ ఇలాగే చేశారు. మొదట ఆయన అనుయాయులు సహచరులు విమర్శలపై వీరంగం తొక్కుతారు. ప్రధాని మాట్లాడకపోవడంపై విమర్శల వాన కురుస్తుంది. అదంతా అలా జరగనిచ్చి ఆ పైన దాని గురించి ప్రస్తావించి ఖండనో విచారమో వ్యక్తం చేయడం మోడీ స్టైల్ అనొచ్చు. ఇప్పుడు వారణాసిలోనూ కొన్ని నిరసనల తర్వాత ఇలా చెప్పినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలి కాని మోడీ తరహా మాత్రం అదే.
పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు, జాతీయ కార్యదర్శి మురళీధరరావు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ వంటివారంతా సమర్థించుకోవడానికి, అవతలి వారిపై దాడికి తంటాలు పడుతుంటే తాపీగా చూసిన మోడీ, హఠాత్తుగా ఏవో రెండు మాటలు మాట్లాడి బాధితులకు ఉపశమనం నేతలకు ఆశ్చర్యం కలిగిస్తారు! రోహిత్ దళితుడా కాదా.. అనే దానిపైనా దాడికి, దౌర్జన్యానికి పాల్పడే కథనాలపైన ఇప్పటి వరకూ బిజెపి నేతలు, వ్యాఖ్యాతలు దృష్టి కేంద్రీకరించారు.
‘మరణం బాధాకరం’ అని ఒక్కమాటతో సరిపెట్టడం తప్ప ఆ ప్రగాఢత ప్రతిబింబించలేదు. ‘భారతమాత ఒక ముద్దు బిడ్డను కోల్పోయింది’ అంటూ మోడీ మాత్రం ఉద్వేగాత్మక భాషను ఉపయోగించారు. వీరిని అలా ఉంచితే తమ మంత్రి సృతి ఇరానీ మాట్లాడేదేమిటో కూడా ప్రధాని తెలుసుకోలేదా? తెలుసుకుంటే మందలించి మార్చలేదా? అనేది ప్రశ్న. ఇప్పుడు ఆయన మాట్లాడ్డం, ఇరానీ రోహిత్ తల్లితో ఫోన్లో సంభాషించడం అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. మరికొన్ని సర్దుబాటు చర్యలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
“గుజరాత్ ఘటనలపై విచారం వ్యక్తం చేస్తారా? అన్నప్పుడు కారు కింద పప్పీ పడితే బాధపడరా?” అంటూ వ్యాఖ్యానించి విమర్శలు కొనితెచ్చుకున్న మోడీ, తర్వాత ఆ ధోరణి మార్చుకున్నట్టు కనిపిస్తుంది. అనునయ వాక్యాల అవసరం ఆయన గుర్తించారు. లేకపోతే లౌకిక విలువలూ సామాజిక న్యాయం కోసం పోరాడే చైతన్యం గల ఈ దేశంలో ఏకపక్ష భాష గుజరాత్ వెలుపల చెల్లుబాటు కాదని తెలుసుకున్నారు. కనుకనే స్పందనను చెప్పే పదాలను ఎంచుకుంటున్నారు.
రోహిత్ విషయంలోనూ అలాగే విచారం వెలిబుచ్చారు గాని అసలు జరగాల్సింది ఆ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రక్షాళన. పాతుకుపోయిన వివక్షతా ధోరణుల తొలగింపు. ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవలసిన దురదృష్టకర పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న మోడీ వాటిని మార్చేందుకు అవసరమైన సాహసోపేత సమగ్ర చర్యలు ప్రకటిస్తారేమో చూడాలి. అప్పుడే ఆయన మాటలకు నిజమైన విలువ. అలాగే మొండిగా బండగా సమర్థించుకుని చనిపోయిన రోహిత్పైన కూడా దాడికి వెనుకాడని ఆయన భక్తబృందం నాయకుడిలానైనా మాట్లాడ్డం నేర్చుకోవడం శ్రేయస్కరం.