పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. జులై 18 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 18 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశాలు మరింత వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. ట్రిపుల్ తలాక్ తోపాటు, జాతీయ బీసీ కమిషన్ కు చట్ట సవరణ బిల్లు కూడా కేంద్రం సిద్ధమౌతున్నట్టు సమాచారం. దీంతోపాటు మరికొన్ని కీలక బిల్లుల్ని కేంద్రం ఆమోదింపజేసుకునేందుకు రెడీ అవుతున్న పరిస్థితి ఉంది.
అయితే, కనీసం ఈసారైనా వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయా అనేదే ప్రశ్న. ఎందుకంటే, గత బడ్జెట్ సమావేశాల్లో ఎంత గందరగోళం మధ్య జరిగాయో తెలిసిందే. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన అంశంపై పార్లమెంటు అట్టుడికింది. ఏపీకి కేంద్రం నెరవేర్చాల్సిన హామీలు, బడ్జెట్ లో ప్రాధాన్యత దక్కకపోవడంతో మిత్రపక్షమైన టీడీపీ ఎదురు తిరగడంతో ఇతర పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. ఏపీ ప్రత్యేక హోదా అంశం సభను కుదిపేసింది. దీంతోపాటు, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలూ మద్దతు పలకడంతో… సభలో మెజారిటీ ఉండి కూడా దాన్ని ఎదుర్కొనలేకపోయింది మోడీ ప్రభుత్వం. తీర్మానంపై రోజూ నోటీసులు ఇవ్వడం, సభ సజావుగా జరగడం లేదన్న కారణంతో స్పీకర్ వాయిదా వేస్తూ గడిపేసిన వైనం తెలిసిందే.
వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఈసారి కూడా సమావేశాలను స్తంభింపజేస్తామని ప్రకటించారు. అవసరమైతే మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎలాగూ ప్రతిపక్షాలు కూడా భాజపాపై బాగా గుర్రుగా ఉన్న పరిస్థితి కాబట్టి… అందర్నీ కలుపుకుంటూ మరోసారి అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చెయ్యొచ్చు. ఇక, గత సమావేశాల్లో రాష్ట్రం కోసం పోరాడీ పోరాడీ అలసిపోయిన వైకాపా… ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఎలాగూ లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా పోరాటంలో చివరి అస్త్ర ప్రయోగంగా ఎంపీలు రాజీనామాలు చేసి, ఆమోదింపజేసుకున్నారు. ఏపీ సమస్యల విషయమై కేంద్రాన్ని వెనకేసుకుని వచ్చే ప్రయత్నం ఈ సమావేశాల్లో ఎవ్వరూ చేసే అవకాశం లేదు. కాబట్టి, ఈసారి సమావేశాల్లో ఏపీ వాణి మరింత స్పష్టంగా వినిపించేందుకు టీడీపీ ప్రయత్నించొచ్చు.