నందమూరి బాలకృష్ణ – అక్కినేని నాగార్జున మధ్య క్లాష్ నడుస్తోందన్న విషయం చిత్రసీమకు విదితమే. ‘మేమిద్దరం బాగానే ఉన్నాం’ అని ఓ సందర్భంలో నాగార్జున క్లారిటీ ఇచ్చినా, ఆ తరవాత జరిగిన పరిణామాలు మాత్రం వేరేలా ఉన్నాయి. బాలయ్య తన వందో సినిమా ఓపెనింగ్‌కి చిరు, వెంకీలను పిలిచి నాగ్ని విస్మరించాడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ సమయంలోనూ నాగ్‌కి ఆహ్వానం అందలేదు. చైతూ రిసెప్షన్‌కి బాలయ్య వెళ్లలేదు. అలా.. నాగ్, బాలయ్య మధ్య క్లాష్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ‘ఎన్టీఆర్’ బయోపిక్ వీరిద్దరి మధ్య దూరం తగ్గించే ఛాన్స్ తీసుకొచ్చింది.
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఏఎన్నార్ గా అక్కినేని నాగచైతన్య కనిపించే అవకాశాలున్నాయని టాక్. దానికి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఏఎన్నార్‌గా కనిపించడానికి చైతూ కూడా ఉత్సాహం చూపిస్తున్నాడట. నిజానికి ఈ పాత్ర నాగార్జునతో చేయించాలన్నది బాలయ్య అభిమతం. ఎన్టీఆర్ పాత్రని ఎన్టీఆర్ తనయుడిగా తాను చేస్తున్నప్పుడు, ఏఎన్నార్ పాత్రని ఆయన వారసుడు నాగార్జున చేయడమే సమంజసం. వీలైతే నాగ్ని కలసి, ఈ పాత్ర గురించి చెప్పి ఒప్పిస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నాడట. నాగ్ ఒప్పుకుంటే సరే సరి. లేదంటే చైతూతో సర్దుకుపోవొచ్చన్నది ప్రస్తుత ప్లాన్. ఇదే గనుక జరిగితే… ఇన్నాళ్లూ దూరం దూరంగా ఉన్న నాగ్, బాలయ్య… ఇప్పుడు భాయీ భాయీ అని చెట్టాపట్టాలేసుకునే అవకాశాలున్నాయి. మరి… ఈ అద్భుతం జరుగుతుందా? ఈ అవకాశం వస్తుందా? బాలయ్య, క్రిష్ చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.