ఎప్పుడో జరిగిపోయిన ఎమర్జెన్సీ రోజుల్ని పనిగట్టుకుని మరీ గుర్తుచేసి, దీనిపై ఈతరం ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు మాట్లాడుతున్నారు! నిజానికి, నిన్ననే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్ లో చాలా వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీని నియంత హిట్లర్ తో పోల్చారు. ఇవాళ్ల ఇదే అంశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘంగా మాట్లాడారు. ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లయిందంటూ, దీనిపై ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మరీ ప్రధాని విమర్శలు చేయడం గమనార్హం.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ… కేవలం కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసమే 1975లో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించిందని ఆరోపించారు. అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ బలి తీసుకుందన్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన ఆ సమయంలో ఏం జరిగిందో ఈతరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ ఎమర్జెన్సీ నాటి రోజులు తెచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలను దూరం పెట్టాలనీ, పౌరులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఉనికి ప్రమాదంలో పడ్డప్పుడు, తమ కుటుంబానికి ఏదైనా సమస్య వస్తుందనుకున్న సమయంలో.. దేశం సంక్షోభంలో ఉందంటూ గాంధీ కుటుంబం కేకలు వేసేదని విమర్శించారు. ఈ సందర్భంగా గాంధీ ఫ్యామిలీ పేరుతో కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు.
అయితే, ఉన్నట్టుండి ఎమర్జెన్సీ రోజులపై ఎందుకింత ఫోకస్ పెడుతున్నారు..? గతంలో ఎన్నడూ లేని విధంగా నాటి పరిస్థితికి నేడు కొత్తగా తద్దినాలు ఎందుకు పెడుతున్నారు..? ఈ చర్చను తెరమీదికి తీసుకుని రావడం ద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనం చేయాలన్నదే మోడీ లక్ష్యం అనేది తెలిసిందే. ఈతరం నాటి ఎమర్జెన్సీ పరిస్థితి గురించి తెలుసుకున్నా ఏమౌతుంది..? అలాంటి పరిస్థితి ఇంకెప్పుడూ రాకూడదనేగా అనుకుంటారు. అయినా, మోడీ ఆరోపిస్తున్నట్టు ప్రతిపక్షాల వల్ల అలాంటి పరిస్థితి వస్తుందా..? అధికారంలో ఉన్నవారికే కదా అలాంటి పోకడలు సాధ్యమౌతాయి. ఇప్పుడున్నది అప్పటి కాంగ్రెస్ పార్టీయే అయి ఉండొచ్చు, అంత మాత్రాన అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా! అప్పటి నేతలూ ఇప్పుడు లేరు. పోనీ, ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని అయినా నియంతృత్వ ధోరణితో వ్యవహరించే సామర్థ్యం ఆయనకి ఉంటుందీ అంటే.. ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు! ఆ మాటకొస్తే భాజపా పాలనే నానాటికీ తీసికట్టుగా మారుతోంది.
ఈ చర్చను తెర మీదికి తీసుకుని రావడం ద్వారా.. మోడీ పాలన వైఫల్యాలపై ప్రస్తుతం మొదలైన చర్చను డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ భాజపాకి ఏదో ఒక ఎమోషనల్ అంశం కావాలి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భావోద్వేగాలకు గురి చెయ్యాలి. ఈ క్రమంలో భాజపా పాలనా వైఫల్యాలపై చర్చ జరగనీయకుండా ప్రయత్నించాలి. ఇలాంటి ప్లాన్ లో భాగంగానే ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారనే అనుమానం కలుగుతోంది.