భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని నిరూపించడానికి తెగ తాపత్రయ పడిపోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదని… బీజేపీ నేతలు.. వరుసగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనికి కౌంటర్‌గా మంత్రి దేవినేని ఉమ ప్రెస్‌మీట్ పెట్టి.. ఇంకా రూ. 1900 కోట్లకుపైగా రావాల్సి ఉందని ప్రకటించారు. బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. అదే సమయంలో.. అదే లెక్క చెబుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. దీంతో బీజేపీ నేతలు.. తాము చెప్పిన వాదనకే కట్టుబడి ఉండాలనుకున్నారో ఏమో కానీ.. మంగళవారం అంతా ఒకరి తర్వాత ఒకరు… పోలవరం బిల్లులేవీ పెండింగ్ లో లేవని ప్రకటనలు చేస్తూ వచ్చారు.
ఉదయం పురంధేశ్వరి… పోలవరానికి సంబంధించిన రూ. 1900 కోట్ల రూపాయల బిల్లులు కేంద్రానికి చేరలేదని.. చెప్పుకొచ్చారు. సాయంత్రానికి జీవీఎల్ నరసింహారావు.. తన ట్విట్టర్లో దేవినేని ఉమను అబద్దాల కోరుగా అభివర్ణిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. అందులో ఏపీకి .. కేంద్రం ఇవ్వాల్సినవి ఏమీ లేనట్లుగా… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చెప్పిందని.. కొన్ని పత్రాలు ట్విట్టర్ లో పెట్టారు. అవి ఓ ఆర్టీఐ అప్లికేషన్‌కు ఇచ్చిన సమాధానంగా జీవీఎల్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ నెటిజన్లు వెంటనే కౌంటర్లు ప్రారంభించారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి… సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న వివరాలను పోస్ట్ చేశారు. అందులో ఇంకా రూ. 1900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్న సమాచారం ఉంది. రెండింటినీ పోలవరం అధారిటీనే చెప్పింది. ఏది కరెక్ట్..? దీంతో మొత్తం వ్యవహారం కన్ఫ్యూజన్లో పడిపోయింది.
అయినా ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా చంద్రబాబు లేఖ రాశారు. ఇంకా రూ. 1900కోట్ల వరకూ పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. క్లియర్ చేయాలని కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. మరి అధికారికంగానే కేంద్రం సమాధానం పంపవచ్చు కదా..! మధ్యలో జీవీఎల్ పార్టీ పరంగా… సమాచారహక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారంతో.. రాజకీయ విమర్శలు చేయడం ఎందుకు..? ఓ ముఖ్యమంత్రి అధికారికంగా డబ్బులు రావాల్సి ఉందని లేఖ రాస్తే.. మీకు ఇవ్వాల్సిందేమీ లేదని.. రిప్లయ్ ఇస్తే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది కాదా..! కానీ జీవీఎల్ ఈ మొత్తాన్ని తన మీద వేసుకుని ఎందుకు రాజకీయం చేస్తున్నారు..?. ప్రజలను గందరగోళ పరిచి.. రాజకీయం చేయడానికి కాకపోతే.. బీజేపీ నేతలు ఏపీకి పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా..?