తెలుగు సినిమాకి సంక్రాంతి పండగ ఎంత ముఖ్యమైందో అందరికీ తెలిసిందే. ఇంతకుముందు ఎలా వున్నా ఈ సంక్రాంతిని మాత్రం టాలీవుడ్ హీరోలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మూడు రోజుల తేడాలో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఏ సినిమా సూపర్‌హిట్ అవుతుంది, ఏ సినిమా డిజాస్టర్ అవుతుంది అని ఎదురుచూసిన ట్రేడ్‌వర్గాలు షాక్ అయ్యేలా నాలుగు సినిమాలూ నష్టాల బారిన పడకుండా రన్ అవుతున్నాయి. అన్నింటినీ మించి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం భారీ కలెక్షన్లు రాబడుతూ ఈ సంక్రాంతికి నెంబర్ వన్ చిత్రం అయింది.
సంక్రాంతి పోరు దాదాపు ముగుస్తున్న తరుణంలో ఇక అందరి దృష్టీ సమ్మర్‌పైన పడింది. సంక్రాంతికి రిలీజ్ అయినట్టు మూడు రోజుల తేడాలో నాలుగు సినిమాలు కాకుండా కొన్నిరోజుల వ్యవధిలో చాలా సినిమాలు సమ్మర్ బరిలో దిగబోతున్నాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని ఏప్రిల్లోగానీ, మేలోగానీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘సరైనోడు’ ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అఆ’ కూడా ఏప్రిల్‌లోనే రిలీజ్ అవుతుంది. ఇక సూపర్‌స్టార్ మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందుతున్న ‘బ్రహ్మూెత్సవం’ కూడా ఏప్రిల్, మే నెలల్లోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాల సంగతి అలా వుంటే కింగ్ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి నిర్మిస్తున్న మల్టీస్టారర్ ‘ఊపిరి’ చిత్రాన్ని కూడా సమ్మర్లోనే రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు. ఇవి కాక చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించే అవకాశం సినిమాలు చాలా వున్నాయి.
సమ్మర్ సీజన్లోనే ఇన్ని సినిమాలు రిలీజ్‌కి వుండడంతో మళ్ళీ తెలుగు సినిమాల మధ్య పోరు తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నాగార్జున సమ్మర్‌కి ‘ఊపిరి’ చిత్రంతో రాబోతున్నాడు. అంటే ఈసారి నాగార్జునతో నలుగురు పెద్ద హీరోలతోపాటు కొంతమంది చిన్న హీరోలు కూడా పోటీ పడే అవకాశం వుంది. మరి ఈ సమ్మర్ విన్నర్ ఎవరు? అనేది తెలుసుకోవాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.