జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకుని, ఆ తరవాత హాస్యనటుడిగా కొన్ని సినిమాలు చేసి, ఇప్పుడు ఏకంగా హీరోగా ప్రమోషన్ తెచ్చేసుకున్నాడు షకలక శంకర్. ‘శంభో శంకర’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే.. ఈ ఛాన్సేమీ సులభంగా రాలేదు. ఈ స్క్రిప్టు పట్టుకుని చాలా చోట్ల తిరిగాడు శంకర్. చాలామందిని కలిశాడు. నిర్మాతగా ఉంటారా? అని నోరు తెరచి అడిగాడు. కానీ ఒక్కరూ ధైర్యం చేయలేదు. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పాడు. దిల్‌రాజు, త్రివిక్రమ్, అల్లు శిరీష్, రవితేజ.. వీళ్లందరినీ కలసి ”రెండు కోట్లు పెట్టండి. ఎనిమిది కోట్లు వచ్చేలా చేస్తా” అని చెప్పాడట. కానీ ఒక్కరు కూడా ధైర్యం చేయలేదు. రవితేజ అయితే `ఇప్పుడు నీకేం తక్కువ.. హీరోగా చేయాల్సినంత అవసరం ఏముంది` అని చిన్న సైజు క్లాసు కూడా పీకాడట. అలాంటి స్క్రిప్టు వేరొకరి చేతుల్లో పడి సినిమాగా మారిపోయింది. సినిమా హిట్టయ్యాక, నాలుగు డబ్బులొచ్చాక.. ` ఈ కథని, ఈ సినిమాని ఇంత మంది రిజక్ట్ చేశారు` అని చెప్పుకోవడం బాగుంటుంది. సినిమా విడుదల కాకముందే.. రిజక్షన్ లిస్టు చెబితే ఎలా? ఇదంతా నెగిటీవ్ పబ్లిసిటీ అయిపోదా? శంకర్ ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్సయ్యాడో. పైగా ‘నాకు కమెడియన్‌గా అవకాశాలు లేవు.. అందుకే హీరో అయ్యా’ అని చెప్పుకుంటున్నాడు. కమెడియన్‌గా రాణించి, ఫుల్ బిజీగా ఉన్నవాళ్లే హీరోగా కలసి రావడం లేదు. అలాంటిది ఈ శంకర్ తనపై తాను ఇంత నమ్మకం ఎలా పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు. అదృష్టమో, శంకర్ కృషో… ఈ సినిమా హిట్టయితే ఫర్వాలేదు. దిల్‌రాజు, త్రివిక్రమ్, రవితేజలు `మంచి ఛాన్స్ మిస్సయ్యామే` అని ఫీలవుతారు. ఫలితం అటూ ఇటూ అయితే.. శంకర్‌కి ఇప్పుడొస్తున్న ఛాన్సులు కూడా రావు కదా??