చాన్నాళ్ల తరువాత మీడియా ముందుకు వచ్చారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. అయితే, ఆయన ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా, కేవలం కొడంగల్ ఎమ్మెల్యేగానే ఎక్కువసేపు మాట్లాడటం గమనార్హం. సొంత నియోజక వర్గ సమస్యల విషయమై సచివాలయానికి వచ్చానని రేవంత్ అన్నారు. తన నియోజక వర్గానికి ఒక ఐటీఐ కళాశాల, రెండు జూనియర్ కాలేజీలు మంజూరు చేస్తున్నట్టు గత డిసెంబర్ లో సీఎం ప్రకటించారన్నారు. ఆ వెంటనే, కొడంగల్ నియోజక వర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాలకు తెరాస పాలాభిషేకాలు చేశారని గుర్తు చేశారు. అయితే, కొత్త విద్యా సంవత్సరం మొదలై ఇన్నాళ్లు అవుతున్నా ఆ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియడం లేదని రేవంత్ అన్నారు.
సచివాలయం ద్వారా పరిపాలన సజావుగా సాగడం లేదనీ, అయినా ముఖ్యమంత్రి రాని సచివాలయంలో పరిస్థితులు ఎలా బాగుంటాయని ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్ లో పరిశుభ్రత లేదనీ, అధికారులకు ఫైళ్ల పట్ల బాధ్యత లేదని విమర్శించారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఇలాంటి సందర్భంలోనే కేసీఆర్ కు కొన్ని గుర్తుకొస్తాయన్నారు. ఉన్నట్టుండి హడావుడిగా విజయవాడ కొండమీద ఉన్న అమ్మవారు గుర్తొచ్చారనీ, కొండ కింద ఉన్న కమ్మవారు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు! తెలంగాణలోని ఒక వర్గాన్ని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు అమ్మవారికి ముక్కుపుడక పెడుతున్నారుగానీ, భక్తితో కాదని రేవంత్ విమర్శించారు!
ముందస్తు ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడినా… కాంగ్రెస్ పార్టీ సంసిద్ధత గురించి ఆయన స్పందించకపోవడం విశేషం! కేసీఆర్ సవాల్ నేపథ్యంలో మీడియా ముందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలంతా ముందస్తు ఎన్నికలకు మేం సిద్దమనీ, కాంగ్రెస్ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెడతారంటూ ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ తరఫున ఎన్నికలకు సిద్ధమౌతున్న వాతావరణం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. బూత్ కమిటీలు, జిల్లా కమిటీలు అంటూ హడావుడిలో పార్టీ ఉంది. ఇంకోపక్క, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలపై కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ అంశాల జోలికి రేవంత్ వెళ్లకపోవడం గమనార్హం. కేవలం కొడంగల్ సమస్యల గురించి మాత్రమే మాట్లాడి, కేసీఆర్ పై కొన్ని విమర్శలు చేసి మమ అనిపించేశారు. కాంగ్రెస్ నాయకుడిగా ఈ సందర్భంలో తన క్రియాశీల పాత్ర గురించిగానీ, పార్టీ పరిస్థితి గురించిగానీ, చివరికి తన మాటల్లో కాంగ్రెస్ ప్రస్థావనగానీ లేకపోవడం గమనార్హం.