జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఉన్న 150 స్థానాలలో 100 స్థానాలను గెలుచుకోవడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని తెదేపా తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదివరకు ఒకసారి చెప్పారు. తమ కూటమి కనీసం 80 సీట్లు సాధించడం ఖాయం అని చెప్పారు. కానీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందుకు విరుద్దంగా మాట్లాడటం విశేషం. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ “జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాదు. మా కూటమి ‘కింగ్ మేకర్’ నిలుస్తుంది,” అని అన్నారు. రేవంత్ రెడ్డి తమ కూటమి కనీసం 80 సీట్లు సాధించడం ఖాయం అని గట్టిగా చెపుతూ పార్టీ అభ్యర్ధులలో, కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రయత్నిస్తుంటే, పార్టీ ఎన్నికల సమన్వయ కర్తగా ఉన్న నారా లోకేష్ ఏ పార్టీకి మెజారిటీ రాదు…తెదేపా-బీజేపీ కూటమి కింగ్ మేకర్ మాత్రమే కాగలదు అని చెప్పడం ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది.
ప్రత్యర్ధి పార్టీ 80-100 సీట్లు సాధిస్తామని పదేపదే ధీమా వ్యక్తం చేస్తునప్పుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ కూడా తమ కూటమి 80-100 సీట్లు సాధిస్తామని గట్టిగా చెప్పిఉంటే అది పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి మంచి బలమయిన సంకేతం పంపినట్లు అయ్యేది. నారా లోకేష్ వాస్తవ పరిస్థితి గురించి చెపుతున్నప్పటికీ, కీలకమయిన ఇటువంటి సమయంలో ఆవిధంగా మాట్లాడటం వారి అభ్యర్ధుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి కూటమికి నష్టం కలిగించవచ్చును.
తమ పార్టీ నేత రేవంత్ రెడ్డి మంత్రి కె.టి.ఆర్.కి విసిరినా సవాలు గురించి కూడా లోకేష్ మాట్లాడారు. “ఈ ఎన్నికలలో తెరాసకు 100 సీట్లు వచ్చినట్లయితే మా రేవంత్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకొంటానని విసిరిన సవాలుకి మంత్రి కె.టి.ఆర్. ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? తెరాసకు అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటే మా తెదేపా నేతల వెంటపడి పార్టీలో చేర్చుకోవడం ఎందుకు?” అని ప్రశ్నించారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదు కనుకనే ఆయన ప్రజల మధ్యకి రాలేక మొహం చాటేస్తూ, తనకి బదులు తన కొడుకు కె.టి.ఆర్.ని ఎన్నికల ప్రచారానికి పంపిస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేసారు. అలసత్వం ప్రదర్శించకుండా పార్టీలో అందరూ కలిసికట్టుగా గెలుపుకోసం గట్టిగా కృషి చేయాలని ఆయన పార్టీ నేతలని, కార్యకర్తలని కోరారు.