ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పని చేసిన నేత ధర్మపురి శ్రీనివాస్. తన లాంటి వ్యక్తికి ఎన్నికల్లో ఓడిపోయారనే కారణం చూపి.. ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదని.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. టీఆర్ఎస్లో చేరారు. డీఎస్‌ను టీఆర్ఎస్ చేర్చుకోవడానికి కారణం.. ఆయన వల్ల ఏదో లాభం వస్తుందని కాదు. అలాంటి బిగ్ పర్సనాలిటీని దూరం చేస్తే…కాంగ్రెస్‌ను పెద్దదెబ్బ కొట్టినట్లవుతుందని. టీఆర్ఎస్కు డీఎస్ అవసరం కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేంత వరకే. ఒక్క డీఎస్సే కాదు.. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా.. గులాబీ కండువాలు కప్పుకున్న వారిలో టీఆర్ఎస్కు వాస్తవంగా అవసరమైన వారు కొంత మంతే. మిగతా ఎమ్మెల్యేలు, నేతలు అందరూ.. ఆయా పార్టీలను బలహీన పరచడానికే పార్టీలో చేర్చుకున్నవారే.
ఇలాంటి వారే ఇప్పుడు టీఆర్ఎస్కు సవాల్ గా.. సమస్యగా మారబోతున్నారు.
తనలాంటి వ్యక్తికి .. టీఆర్ఎస్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని డీఎస్ ఆరోపణ. ఆయనకే కాదు..అలాంటి ఆలోచనలు.. నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురికి ఉన్నాయి.వారంతా… టీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న వారు కాదు. అధికారం అందిన తర్వాత వలసొచ్చిన వారు. వీళ్లే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పరిస్థితిని గందరగోళంలో పడేసే పరిస్థితి ఏర్పడుతోంది. ముందస్తుకు సిద్ధమని.. కేసీఆర్ దూకుడుగా సవాళ్లు చేస్తున్నారు కానీ.. ముందుగా ఓవర్ లోడ్ అయిన కారులోని నేతలను సముదాయించడమే అసలు సమస్య. పార్టీ తరఫున బరిలోకి దింపాల్సిన గెలుపు గుర్రాల ఎంపిక అంత తేలిక కాదు. నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు టీఆర్ఎస్నాయకత్వానికి కత్తిమీద సాము కావడం ఖాయమే.
టీఆర్ఎస్లో చేరిన నేతల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలూ ఉన్నారు. వీరంతా తమ రాజకీయ భవిష్యత్‌కోసమే గులాబీ గూటికి చేరారు. వీరిలో అత్యధికులు వచ్చే ఎన్నికల్లో పోటీకి టీఆర్ఎస్నుంచి టికెట్ఆశిస్తున్నవారే. తెలంగాణల 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. టిక్కెట్ల కోసం … తీవ్రంగా పోటీ పడేవారు..కనీసం ఐదు వందల మంది ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్63 స్థానాల్లో గెలవగా, ఉప ఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. దీంతో ఆ సంఖ్య 65కు చేరింది. వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు 25 మందిని కలిపితే టీఆర్ఎస్ఎమ్మెల్యే సంఖ్య 90కి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లిస్తానని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అంటే మిగిలేది కేవలం 29 నియోజకవర్గాలు.వాటిలో పాతబస్తీ సీట్లు పది వరకూ ఉంటాయి.
టీఆర్ఎస్ లో అందరి టార్గెట్ టిక్కెట్. అది దొరకకపోతే.. గులాబీ పార్టీపై ఏ మాత్రం సానుభూతి చూపించడానికి ఎవరూ సిద్దంగా ఉండరు. ఎందుకంటే.. వారు రాజకీయ భవిష్యత్ కోసమే టీఆర్ఎస్ లో చేరారు కాబట్టి. గులాబీ టిక్కెట్ దొరకకపోతే.. కాంగ్రెస్, టీడీపీ.. చివరికి…కోదండం పార్టీ తెలంగాణ జనసమితిలో అయినా చేరడానికి సిద్ధపడిపోతారు. వీరిని కంట్రోల్ చేయడమే కేసీఆర్ కు అసలు సమస్య.