తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. కానుకలు సమర్పించుకుంటానని.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాల దేవుళ్లు, దేవతలకు కేసీఆర్ మొక్కుకున్నారు. వాటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు. ఈ సారి కనకదుర్గమ్మ వంతు. కుటుంబ సమేతంగా… విజయవాడ వెళ్లి.. కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించబోతున్నారు కేసీఆర్. ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కులను ఒక్కొక్కటిగా కేసీఆర్ చెల్లించుకుంటూ వస్తున్నారు. సహజంగానే ప్రభుత్వం డబ్బులతో మొక్కులు చెల్లించడమేమిటన్న విమర్శలు… మొదటి నుంచి వస్తున్నాయి.
కేసీఆర్ మొక్కులు చెల్లించడం ఇదే మొదటిసారి కాదు. తిరుమల శ్రీవారికి దాదాపు రూ. 5 కోట్లతో అద్భుతమైన సాలగ్రామహారం, కంఠాభరణం చేయించారు. 14.2 కిలోల సాల గ్రామహారం, 4.65 కిలోల మకరకంఠిలను శ్రీవారికి సమర్పించారు. మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలను సమర్పించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ. 3 కోట్ల 70 లక్షల విలువైన 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని సమర్పించారు.
అయితే తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ మాత్రం.. కేసీఆర్ విజయవాడ పర్యటనకు మరో కోణం జోడించారు. కొండమీద అమ్మోరు.. కొండ కింద కమ్మోరుని ప్రసన్నం చేసుకోవడానికే కేసీఆర్ విజయవాడ వెళుతున్నారని సెటైర్ వేశారు. జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మతల్లి, ఊరూరా పోచమ్మ తల్లులున్నారని.. ఇక్కడ ఎవరికీ ఏమీ చేయించని సీఎం.. విజయవాడకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా గుర్తుకు రాని ముక్కుపుడక ఇవాళే ఎందుకు గుర్తుకు వచ్చిందన్నారు. కమ్మవాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్నదిగా రేవంత్ తేల్చేశారు.
రేవంత్ విమర్శల్లో వాస్తవం ఎంత..రాజకీయం ఎంత అనేదాన్ని పక్కన పెడితే..ఇప్పుడు కేసీఆర్ విజయవాడ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాత్రం కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే..ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ఏరువాక ప్రారంభించడానికి వెళ్తున్నారు. పొరుగు రాష్ట్ర సీఎంగా ప్రొటోకాల్ ప్రకారం.. జిల్లా మంత్రులు..స్వాగతం చెప్పి..కేసీఆర్‌ను సాగనంపే అవకాశం ఉంది.