రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికను భాజపా, కాంగ్రెస్ లు ప్రతిష్ఠాత్మకంగా చూస్తున్నాయి. కొద్దిరోజుల కిందట తెరాస నుంచి కె. కేశవరావు అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తరువాత తేలిపోయింది. అయితే, ప్రతిపక్షాల తరఫు అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ నేత తెర మీదికి వస్తున్నట్టు సమాచారం. టి.ఎమ్.సి. అభ్యర్థికి మద్దతు ఇస్తామంటూ కాంగ్రెస్ కూడా మమతా బెనర్జీకి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి, రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నిక అనేది అంతగా ప్రాధాన్యత లేని అంశంగా ఉంటూ వచ్చేది. కానీ, రాజ్యసభలో కాంగ్రెస్ కు కొంత అవకాశం ఉంది కాబట్టి, ఇక్కడ భాజపాకి ఛాన్స్ ఇవ్వకూడదనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
ఈ క్రమంలో విపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉండటం, తాను వెనక ఉండి ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు కూడా సంసిద్ధం కావడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాయ్ అనే వ్యక్తి పోటీకి దిగుతున్నారు. దీంతో భాజపా కూడా పోటీకి దిగడం అనివార్యంగానే కనిపిస్తోంది. మమతా బెనర్జీ అభ్యర్థి అనగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు ఉంటుందీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి మద్దతు వస్తుందీ, ఇతర భాజపా వ్యతిరేక పార్టీలు కూడా టి.ఎమ్.సి.కి అండగా నిలవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎటువైపు ఉంటారనేది కూడా తేలిపోతుంది. ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే ఆయన ఎటూ మొగ్గకుండా తటస్థంగా ఉండిపోయే అవకాశం ఉంది. తెరాస లాంటి పార్టీలు తటస్థంగా ఉండిపోయే పరిస్థితి వస్తే, భాజపా అభ్యర్థి గెలిచే అవకాశాలు రాజ్యసభలో చాలా తక్కువ.
విపక్షాల మధ్య కనిపిస్తున్న ఐకత్యను గమనిస్తే.. రాజ్యసభలో తమ పట్టు ప్రదర్శించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, ఈ క్రమంలో భాజపా వ్యూహం ఏంటనేదే చూడాలి. భాజపా మద్దతుతో ఇతర పార్టీల అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశం తక్కువ. ఒకవేళ ముందుగా ఊహాగానాలు వచ్చినట్టు తెరాస లాంటి తటస్థ పార్టీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే.. సొంత ఎన్డీయే మిత్రపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. కాబట్టి, భాజపా సొంత అభ్యర్థిని పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే భాజపాకి సొంతంగా అంటూ రాజ్యసభలో పెద్దగా బలమేమీ లేదు. అందుకే, మద్దతు కూడగట్టుకోవడం కోసమే తటస్థంగా ఉన్న కేసీఆర్ లాంటి వారిని చేరువ చేసుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారిపోయింది. ఓరకంగా, ఇది భాజపాయేతర కూటమిలోని పక్షాల మధ్య ఐకత్యను పెంచే మరో వేదికగా మారుతుందనడంలో సందేహం లేదు.