ప్రతీ కమిడియన్కీ ఏదో ఓ రోజు హీరో అయిపోవాలని ఉంటుందేమో. టాలీవుడ్లో అలరించిన హాస్య నటులంతా.. హీరో ప్రయత్నాలు చేశారు. చాలా మంది విఫలమయ్యారు. కొంతమందే విజయం సాధించారు. సునీల్ లాంటి వాళ్లు కూడా యూ టర్న్ తీసుకుని మళ్లీ కమెడియన్ అవతారాలు ఎత్తుతున్నారు. అయినా సరే.. ఈ పరంపర ఆగడం లేదు. తాజాగా షకలక శంకర్ హీరోగా అవతారం ఎత్తాడు. `శంభో శంకర`తో. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శంకర్‌తో చిట్ చాట్.
* కమెడియన్లంతా మంచి పీక్‌లో ఉన్నప్పుడు హీరోగా అవతారం ఎత్తారు. మీరే కాస్త తొందరపడినట్టున్నారు.
– తొందర కాదండీ.. నాకు కమెడియన్‌గా అవకాశాలు రావడం లేదు. నా రేంజ్‌కి తగిన పాత్రలు దక్కడం లేదు. చేతిలో పని లేదు. అందుకే హీరో అయ్యా.
* మీ రేంజ్ ఎంతని అనుకుంటున్నారు?
– ఆనందో బ్రహ్మ చూశారు కదా? అందులో నా పాత్రకు మంచి పేరొచ్చింది. గీతాంజలి, రాజుగారి గది సినిమాల్లో నా పాత్రలు బాగా నవ్వించాయి. ఆ స్థాయి పాత్రలు కావాలి. అంతే. నేనేదో హీరో అయిపోవాలని, డబ్బులు బాగా సంపాదించాలని ఈ అవతారం ఎత్తలేదు. అంతకు ముందు నాకు రోజుకి 30 నుంచి 40 వేలు ఇచ్చేవారు. ఈ సినిమాకి 50 రోజులు పనిచేశా. రోజుకి రమారమీగా 13 వేలు దక్కాయి. కానీ చేతి నిండా పని దొరికింది. ఆ సంతృప్తి కోసమే హీరో అయ్యా.
* ప్రతీసారీ మంచి పాత్రలే దొరకాలంటే కుదరదు కదా, ఎడ్జస్ట్ అవ్వాలనిపించలేదా?
– ప్రతీరోజూ బిరియానీ తినకపోవొచ్చు. కానీ నచ్చింది తినాలని ఉంటుంది కదా? బిరియానీ దొరకలేదని ఏది పడితే అది తినలేం కదా. నేనూ అలానే అనుకున్నా. అందుకే నాకు నచ్చని చాలా సినిమాల్ని వదిలేసుకున్నా.
* డాన్సులు చేయాలి, ఫైటింగులు చేయాలి అనే కోరికలు తీర్చుకోవడానికి ఈ బాట పట్టారేమో..
– కాదండీ. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టు ఏం చేయాలో అది చేశా. అంతే తప్ప… డాన్సుల కోసం, ఫైటింగుల కోసం హీరో అవ్వలేదు.
* ఈ కథ పట్టుకుని త్రివిక్రమ్, దిల్‌రాజు, రవితేజ ల చుట్టూ తిరిగారు. అసలు వాళ్లెందుకు మీతో సినిమా చేయాలి?
– నాతో సినిమా చేస్తే మరో పదిమందికి అన్నం పెట్టినట్టవుతుంది అని వాళ్లని అడిగాను. నేనేం దొంగతనం చేయడం లేదు.. కేవలం అడుక్కున్నానంతే. దానికి సిగ్గు పడడం ఎందుకు? వాళ్లేం నాతో సినిమా చేయను అనలేదు. కాస్త సమయం కావాలి అన్నారంతే. నేను ఆగలేకపోయాను. ఎన్నాళ్లని కడుపు మాడ్చుకుని ఉంటాను? అందుకే… మరో నిర్మాతని చూసుకున్నాను.
* ప్రతిభ ఉన్నా మీకు అవకాశాలు రావడం లేదంటారా?
– ప్రతిభ ఉందో లేదో పరిశ్రమకు తెలుసు, నాకు తెలుసు. అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదో దర్శకులకే తెలియాలి.
* ఈ కథ పట్టుకుని మీ గురువు రాంగోపాల్ వర్మ దగ్గరకు వెళ్లలేకపోయారా?
– ఆయనకే హిట్లు లేవు. ఇక నాకేం అవకాశం ఇస్తారు. సామీ ఓ హిట్టు కొట్టుసామి అని అంటున్నా ఆయన పట్టించుకోవడం లేదు.
* పవన్ కల్యాణ్ రిఫరెన్సులు ఈ సినిమాలో కనిపిస్తాయా?
– అవన్నీ అనుకోకుండా వచ్చినవే నండీ. నేనేం కావాలని పెట్టలేదు. కానీ అవన్నీ చూసి `మొత్తానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్ అనిపించుకున్నావ్ రా` అంటున్నారంతా.
* పవన్ పిలిస్తే.. జనసేన లో చేరతారా?
– నాకు రాజకీయాల గురించి తెలీదు. ఆయన నాకు దేవుడు అంతే. ఆయన రమ్మంటే నేననంటే ప్రతీ అభిమానీ ఆయన వెంట నడుస్తాడు.
* డ్రైవర్ రాముడు సినిమా ఆగిపోయిందా?
– ఓ పాట, ఓ ఫైటూ తీశారు. ఆ తరవాత ఆ సినిమా గురించి నాకు తెలీదు.
*ఈ సినిమా అటూ ఇటూ అయితే మీ కెరీర్ ఏమైపోతుందో అనే భయం వెయ్యలేదా?
– ఒక్క సినిమాకే చరిత్ర ఆగిపోతుందా? ఫ్లాపులొచ్చిన హీరోలు ఎంతమంది లేరు? వాళ్లంతా సినిమాలు వదిలేసి వెళ్లిపోయారా?
* ఇక హీరోగానే చేస్తారా?
– లేదండీ ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తా. నాగచైతన్య సినిమా సవ్యసాచిలో ఓ మంచి పాత్ర చేశా.
* ఓకే… ఆల్ ద బెస్ట్
– థ్యాంక్యూ