భాజపాతో వైకాపా కుమ్మక్కు అనే విమర్శలు వినపడగానే ఒంటికాలిపై పైకి లేస్తుంటారు ప్రతిపక్ష పార్టీ నేతలు. భాజపాతో తమకు సంబంధం లేదనీ, టీడీపీ లాలూచీ పడిందనీ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేసిందనే ఒక వాదనను పదేపదే వినిపిస్తూ ఉంటారు. వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ఇదే తరహా వాదన తాజాగా వినిపించారు. కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న దీక్షను ఆమె తప్పుబట్టారు. ఇప్పటికిప్పుడే కడపకు ఏదో అన్యాయం జరిగినట్టుగా సీఎం రమేష్ హడావుడిడి దీక్ష చేయడమేంటని ఆమె విమర్శించారు. కేంద్రంలో టీడీపీ ఎంపీలు పదవులు అనుభవించారనీ, ఈ నాలుగేళ్లపాటు ఏపీ ప్రయోజనాలు ఎందుకు గుర్తులేదని మండిపడ్డారు. గతంలో దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి అప్పుడు కడప ఉక్కు కర్మాగారం ఎందుకు గుర్తు రాలేదన్నారు.
వైయస్సార్ సీఎం అయిన తరువాత ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ప్రయత్నించారనీ, కానీ ఆ సమయంలో కూడా టీడీపీ అడ్డుపడిందని రోజా ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నివేదిక కోరితే, దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆమె వ్యాఖ్యానించారు. కడపలో ప్లాంటు ఏర్పాటుకు అవకాశమే లేదని చెప్తూ టీడీపీ సర్కారే నివేదికలు ఇవ్వలేదని తప్పుబట్టారు. వైకాపా ఎంపీలు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేశారనీ, ఆ క్రమంలో పదవుల్ని త్యాగం చేశారని ఆమె అన్నారు. విభజన హామీలపై ప్రతిపక్ష నేత జగన్ గడచిన అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు.
రోజా మాటల్లో స్పష్టంగా భాజపా వాదనే వినిపిస్తోంది..! హమీల విషయమైగానీ, ఇప్పుడీ కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయమైగానీ కేంద్రం చెబుతున్నదేంటీ… ఏపీ సర్కారు సరైన నివేదికలు ఇవ్వడం లేదనే కదా! ఇప్పుడు అదే మాట రోజా కూడా అంటున్నారు. కేంద్రంతో టీడీపీ విభేదించిన దగ్గర్నుంచీ ప్రతీ అంశంలోనూ భాజపా వినిపిస్తున్న వాదన ఇదే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రాలను సమానంగా చూసుకోవాలి, కేంద్రం నుంచి ఇవ్వాల్సినవి ఇవ్వాలనే బాధ్యతను భాజపా నెరవేర్చడం లేదు. ఈ కోణాన్ని వైకాపా నేతలెవ్వరూ టచ్ చెయ్యరు. అయితే, ఎమ్మెల్యే రోజా మరో అడుగుముందుకేసి.. అచ్చంగా భాజపా నేతలు చేస్తున్న విమర్శలే చేశారు. రిపోర్టులు అడుగుతున్నా రాష్ట్రం ఇవ్వడం లేదనే మాటే చెప్పారు. ఒక సింపుల్ లాజిక్… కేవలం నివేదికలు ఇచ్చినంత మాత్రాన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటే.. వాటిని ఇవ్వడంలో టీడీపీ సర్కారుకు ఉన్న కష్టమేంటీ..? ఇలా విమర్శలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి కూడా తప్పుతుంది కదా. రిపోర్టులు ఇచ్చినంత మాత్రాన పనులైపోతాయా..? లేదా, రిపోర్టుల లేవంటే పనులు ఆగిపోతాయా..? కడప కర్మాగారం విషయమై అసాధ్యమని సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. దీంతో టీడీపీ పోరాటం అనగానే మార్చిందీ కేంద్రమే. వైకాపా నేతలు ఇలాంటి టాపిక్స్ ఎందుకు మాట్లాడరు..? భాజపాతో మిలాకత్ లేదు లేదంటూనే ఆ పార్టీ వాదననే వైకాపా నేతలు వినిపిస్తుంటే ఏమనుకోవాలి..?