ఎన్టీఆర్ బయోపిక్ మూవీ సినిమా షూటింగ్ కొనసాగించడానికి నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబం పర్మిషన్ తీసుకోవాలా..? అవుననే అంటున్నారు.. ఆ కుటుంబీకులు. అనడమే కాదు… నేరుగా లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్‌తో పాటు బాలకృష్ణకు కూడా ఈ నోటీసులు పంపారట. ఎన్టీఆర్ బయోపిక్ లో తమ పాత్రలను తెరకెక్కించడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వారి అభ్యంతరం. తమను విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వారికి సమాచారం ఉందట.
నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎవరికి క్యారెక్టర్లు ఎంతెంత ఉంటాయన్నదానిపై ఇప్పటికీ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. మొదట ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. అప్పుడు కథ అనున్నారు. ముహుర్తం కూడా జరుపుకున్నారు. కానీ తేజ వైదొలిగారు.. ఆ తర్వాత క్రిష్ రంగంలోకి వచ్చారు. అప్పుడే కథ, కథనాల విషయంలో.. క్రిష్ స్టైల్ లో మార్పులు చేర్పులు జరగడం ఖాయమని తేలిపోయింది. బాలకృష్ణ కూడా… క్రిష్ మీద పూర్తి నమ్మకం ఉంచారు. అయితే ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో… నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ కీలకం. ఆ ఎపిసోడ్ లేకుండా.. సినిమా ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో.. ఎక్కడ ముగుస్తుందో మాత్రం ఇప్పటికీ టాప్ సీక్రెట్‌గానే ఉంచారు.
కొంత మంది ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించి.. తొమ్మిది నెలల్లోనే ఘన విజయం సాధించిన ఘటనతో ముగుస్తుందని చెబుతున్నారు. మరికొంత మంది నాదెండ్ల ఎపిసోడ్ వరకూ ఉంటుందంటున్నారు. అదే జరిగితే…నాదెండ్ల భాస్కర్ రావు క్లైమాక్స్ లో విలన్ గా ఉండటం ఖాయమే. ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు ఇందిరాగాంధీ సాయంతో.. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి.. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టారు నాదెండ్ల భాస్కరరావు, నెల రోజుల పాటు సీఎంగా ఉండగలిగారు. ప్రజాగ్రహంతో.. ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయకతప్పలేదు. ఎన్టీఆర్ ఎన్నికల్లో గెలవడం కన్నా.. అసలు రాజకీయాల్లో గెలవడం అదే మొదటిసారి. అందుకే అక్కడి వరకే క్లైమాక్స్ ఉండవచ్చన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే సినిమా షూటింగ్ కొనసాగించడానికి నాదెండ్ల పర్మిషన్ అవసరమా అంటే.. అవసరం లేదనే.. సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటి వరకూ తెరకెక్కిన బయోపిక్ మూవీల అనుభవాలు చెబుతున్నాయంటున్నారు. అయినా నాదెండ్ల కుటుంబం ఊరికే ఎందుకు కంగారు పడుతుందో.. ఎవరికీ అర్థం కావడం లేదు. 1984 ఆగస్టులో ఏం జరిగిందో.. ఇప్పటికీ ప్రపంచానికి తెలుసు. కొత్త తరానికి కూడా.. ఇంతో ఇంతో తెలుసు. తమ ఇమేజ్ ను మేకోవర్ చేసుకోవడానికి ఇప్పుడు నాదెండ్ల ఫ్యామిలీకి చాన్స్ లేదు. జరిగింది జరిగినట్లు చూపిస్తారు కానీ..బయోపిక్ మూవీల్లో ప్రత్యేకంగా నెగెటివ్ పాత్రలంటూ ఉండవని.. సినీ వర్గాలు చెబుతున్నాయి. నాదండ్ల కుటంబం నోటీసుల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు.