Shambo Shankara sameeksha
తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5
మైసూర్ పాక్‌లో మైసూరు, బందరు లడ్డుల్లో బందరు ఎలా ఉండదో.. కమిడియన్లు హీరోగా చేసే సినిమాల్లో కామెడీ ఉండదని ఆడియన్స్ ఫిక్సయిపోవాల్సివస్తోంది.
అదేంటో.. కమిడియన్ల దగ్గర ఓ చెడ్డ అలవాటు ఉంది. కామెడీ చేసి చేసి పేరు తెచ్చుకుంటారు. అదే ఎంట్రీ కార్డుగా చూపించి హీరోగా అవకాశం కొట్టేస్తారు. కానీ వాళ్లు చేసే సినిమాల్లో కామెడీ ఉండదు.
ఆ హీరోలా ఫైట్లు చేద్దాం
ఈ హీరోలా డాన్సులు చేద్దాం
అందరిలా డైలాగులు చెప్పేద్దాం… అనే తపనే తప్ప.. ‘నన్ను చూడ్డానికి ఎందుకు వస్తారు, నవ్వించడానికే కదా’ అనే క్వశ్చన్ మాత్రం వేసుకోరు. హాస్యనటులంతా చేసే తప్పే ఇది. మరి ఇప్పుడు షకలక శంకర్ హీరో్గా అవతారం ఎత్తాడు. మరి శంకర్ ఏం చేశాడు? తన అలవాటు ప్రకారం నవ్వించాడా, లేదంటే హీరోయిజం అనే కిరీటం నెత్తిమీద పడగానే… మాస్ హీరోల్లా ఫైట్లు, డాన్సులు చేసేసి, డైలాగులు ఊదరగొట్టేశాడా? అసలు ఈ శంకరుడి కథేంటి?
కథ
ప్రెసిడెంటు (అజయ్ ఘోష్) దౌర్జన్యాలకు, అవినీతికి బలైపోతున్న గ్రామం అది. పోలీసులు కూడా ప్రెసిడెంటు మనుషులే. అందుకే ఆ ఊరికి కష్టాలు ఎక్కువైపోతాయి. ఎలాగైనా పోలీసై.. ఆ ఊరిని కష్టాల నుంచి గట్టెక్కించాలని భావించే కుర్రాడు శంకర్ (షకలక శంకర్). ప్రెసిడెంటుకి ఎదురు తిరిగిన పాపానికి, చేతుల్లోకి వచ్చిన పోలీసు ఉద్యోగం పోగొట్టుకుంటాడు. తన చెల్లిల్ని కూడా కోల్పోవాల్సివస్తుంది. అందుకే ప్రెసిడెంటుపై ఎదురు తిరుగుతాడు. ప్రెసిడెంటు ఆగడాల్ని అడ్డుకుంటూ ఆ ఊరిని కాపాడడానికి రంగంలోకి దిగుతాడు. అందుకోసం ఏం చేశాడు? ఎలాంటి దారిలోకి వెళ్లాడు? అనేదే కథ.
విశ్లేషణ
ఓ మాస్ హీరో కోసం కథ రాసుకుని `ఇలాంటి కథ నేను చేయను బాబోయ్` అంటూ వాళ్లు తిప్పి కొడితే దాన్ని షకలక శంకర్‌తో లాగించేసినట్టుంది. ప్రెసిడెంటు దౌర్జన్యాలకు బలైపోతున్న ఓ గ్రామం, దాన్ని ఉద్ధరించడానికి వచ్చిన హీరో, ప్రెసిడెంటుపై సవాల్ చేయడం, ఊరిని బాగు చేయడం, స్కూళ్లు కట్టించడం, జెండా ఎగరేయడం, రైతుల గురించి స్పీచులు ఇవ్వడం… ఇవన్నీ చూస్తుంటే షకలక శంకర్‌కి మాస్ హీరోగా ఎదిగిపోవాలన్న తపన ఎక్కువైపోయి ఈ సినిమా చేశాడేమో అనిపిస్తుంది. ఎవరి బలాలు, బలహీనతలు వాళ్లు తెలుసుకుంటే – సగం విజయం సాధించినట్టే. శంకర్ బలం… వినోదం. శ్రీకాకుళం యాసలో బాగా నవ్విస్తాడని ప్రసిద్ది. దాన్ని వదిలేసి.. పవన్ కల్యాణ్‌లా డైలాగులు చెబుదాం, బన్నీలా డాన్సులు చేద్దాం, ఎన్టీఆర్‌లా ఫైటులు చేద్దాం అనుకున్నాడు. అవన్నీ సరే – వాటితో పాటు షకలక శంకర్‌లా నవ్వించాలి కదా? ఆ సంగతి మర్చిపోయాడు.
శంకర్ ఊగిపోతూ డైలాగులు చెప్పాడు – కానీ ఉత్తేజం రాదు
తీగలా స్టెప్పులు వేశాడు – కానీ ఉత్సాహం రాదు
రక్తాలు కారేలా ఫైటింగులు చేశాడు – కానీ ఊపు రాదు
పైగా.. ఎవరికో పేరడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. `ప్రెసిడెంటుగారి మనుషుల్నే పంచెలు తడుపుకునేలా చేశావు కదరా` అంటూ శంకర్‌ని ఉద్దేశించి విలన్ మనుషులు డైలాగులు చెబితే మనకు నవ్వొస్తుంది.
అజయ్ ఘౌష్లాంటి భారీ పర్సనాలిటీని పట్టుకుని వార్నింగులు ఇస్తుంటే.. ఏదోలా అనిపిస్తుంది.
ఇలా ప్రతీ చోటా.. మాస్ హీరో అయిపోదామన్న ప్రయత్నమే. పోనీ.. అలానే అయిపోవొచ్చు. దానికి సరిపడా దమ్ము ఈ కథలో ఉండాలి కదా? ఎర్ర సినిమాలు నాలుగైదు చూస్తే ఇలాంటి కథలు బోలెడు అల్లు కోవొచ్చు. ఊరి ప్రెసిడెంటు దౌర్జన్యాలు, అక్కడ వెలిగిన ఓ అభ్యుదయ కెరటం.. ఇది ఏకాలం నాటి ఫార్ములా? దానికి తోడు హీరోయిన్‌తో రొమాన్స్, పాటలు. వాళ్ల మధ్య విరహం. వాటి మధ్య శంకర్ లాంటి కామెడీ ఫేసు సెట్టు కాలేదు. అంతెందుకు.. ఆనలేదు కూడా.
ఓ చోట హీరో హీరోయిన్లు కౌగిలించుకుని డ్రీముల్లోకి వెళ్లిపోతారు. అది చూస్తే ‘ఇక్కడ పాటొస్తుందేమో’ అన్నంత భయం వేస్తుంది. అది దర్శక నిర్మాతలకూ అర్థమైపోయి.. డైరెక్ట్‌గా నెక్ట్స్ సీన్లోకి వెళ్లిపోయారు. దాంతో.. ‘హమ్మయ్య’ అనుకున్నారు ఆడియన్స్. దీన్ని బట్టి… వాళ్ల కెమెస్ట్రీ, రొమాన్స్ ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి.
ఇవన్నీ ఒక యెత్తు. క్లైమాక్స్ మరో ఎత్తు. ‘ఈ సినిమాకి ఇదే ప్రాణం.. దీని కోసమే సినిమా తీశాం’ అన్నట్టుగా ఓ ట్విస్టు దాచారు. అది చూసి ప్రేక్షకుడేం ఆశ్చర్యపోడు. ‘దీని కోసం ఇంకొచెం సేపు ఈ సినిమా చూడాలా’ అన్న భయం వేస్తుంది. అలా మొత్తానికి శంకరుడు… అను క్షణం సహనాన్ని పరీక్షిస్తూ.. కాస్త కాస్త హింసిస్తూ ముందుకు పోయాడు.
నటీనటులు
శంకర్‌కి ఏదో చేయాలన్న తపన ఉంది. దాన్ని తప్పుపట్టలేం. కానీ ఈ కథ సరైన వేదిక కాదు. తనలోని కామెడీని చంపేసుకుంటూ సీరియెస్నెస్ పలికిద్దామని చేసిన ప్రయత్నాల్లో తన వరకూ విజయవంతమైనా.. వాటిని చూడ్డానికి ప్రేక్షకుడు ఇంకా సిద్ధంగా లేడన్న విషయాన్ని గుర్తించాలి. డాన్సులు, ఫైట్లు బ్రహ్మాండంగా చేశాడు. కాకపోతే… పాటలకు డూప్‌ని పెట్టి చేయిస్తున్నట్టు అనిపించింది. హీరోయిన్ మరీ ముదిరిపోయింది. అజయ్ ఘోష్ ఎప్పట్లా ఓవర్ చేశాడు.
సాంకేతికంగా
సాయికార్తిక్ రిజెక్టెడ్ ట్యూన్లు ఇక్కడ వాడుకునే అవకాశం దక్కింది. పెద్ద హీరో కి ఇచ్చినట్టు భీకరమైన ఆర్.ఆర్ కొట్టేశాడు. శంకర్‌కి సరిపడా కథ, సన్నివేశాలు రాసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. నిర్మాణ విలువలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. రైతుల గురించి చెప్పిన సంభాషణలు కూడా ఫేస్ బుక్ కామెంట్లు లా అనిపించాయి.
తీర్పు
కమెడియన్లు హీరోలుగా మారడం ఈజీనే. కానీ నిలబెట్టుకోవడం కష్టం. మాస్ హీరోగా ఎదగాలన్న ప్రయత్నంలో తమలోని ప్లస్సుల్ని కప్పేసుకుని, లేని టాలెంటేదో బయటకు చూపించే ప్రయత్నం చేసి విఫలమవుతుంటారు. అందుకు ఈ శంకర్ ఓ ఉదాహరణ మాత్రమే.
ఫైనల్ టచ్: షకలక.. ఏమిటీ లకలక
తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5