స్నేహంగా ఉండే క్లాస్మేట్ని అత్యాచారం చేసి… వీడియో తీసి… డబ్బులు డిమాండ్ చేసేవారిని స్టూడెంట్స్ అంటారా..?. చదువుకునే దశలోనే ఇంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే.. తర్వాత ఎంత కరుడుగట్టిన క్రిమినల్స్ అవుతారు..?. తెలుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కాలేజీలు ప్రస్తుతం ఇలాంటి క్రిమినల్స్‌నే ఉత్పత్తి చేస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు.. చైన్ స్నాచింగ్ కేసుల్లో దొరికిపోయే ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ కేసులో.. స్నేహితురాల్ని రేప్ చేసి.. వీడియో తీసి.. రూ. 10లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడ్డారు.
కృష్ణా జిల్లా అగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఈ నేరానికి పాల్పడ్డారు. స్నేహంగా ఉండే క్లాస్మేట్ని పుట్టిన రోజు వేడుకల పేరుతో రూముకి ఆహ్వానించారు. కేక్ కట్ చేసి.. కూల్ డ్రింక్ ఇచ్చారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలపడంతో… ఆ విద్యార్థిని ఏం చేస్తుందో తెలియని స్థితికి వెళ్లిపోయింది. ఆ స్నేహితులు ఆమెపై అత్యాచారం చేశారు. సెల్‌ఫోన్‌తో వీడియో కూడా తీశారు.
వారం రోజుల తర్వాత.. ఆ ఇద్దరు మిత్రులు.. ఆ వీడియోను విద్యార్థినికి చూపించి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. రూ. 10 లక్షలు ఇవ్వకపోతే..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. స్నేహితులే ఇలే చేస్తారని ఊహించలేకపోయిన ఆ విద్యార్థిని..తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దాంతో వారు కాలేజీ కరస్పాండెంట్ వద్ద పంచాయతీ పెట్టారు. జీవితాలు నాశనం చేసుకోవద్దని.. కరస్పాండెంట్ హెచ్చరిచండతో.. విద్యార్థులు క్షమాపణలు చెప్పారు. వీడియోలు డిలీట్ చేస్తున్నట్లు నటించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కరస్పాండెంట్.. విషయాన్ని బయటకు పొక్కకుండా.. పోలీసు కేసుల వరకూ వెళ్లకుండా.. సర్దుబాటు చేశారు.
కానీ..స్నేహితురాలినే అత్యాచారం చేసి.. వీడియో తీసి.. బ్లాక్ మెయిలింగ్ చేసేంత క్రిమినల్ మైండ్ సెంట్ ఉన్న వారు ఊరుకుంటారా..? అప్పటికే తాము కాపీ చేసుకున్న అత్యాచారం వీడియోను.. సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు. ఈ సారి అత్యాచారం చేస్తున్న విద్యార్థుల మొహలను బ్లర్ చేశారు. కానీ విద్యార్థిని మొహం అందరికీ కనిపించేలా ఉంచారు. దాంతో ఆ విద్యార్థిని కుటుంబం అవమానంతో చితికిపోయింది. విద్యార్థిని తండ్రి అగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు .ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.