ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన సందర్భంగా టీడీపీ ఎంపీలు సరదాగా మాట్లాడుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాష్ట్రంలో కడప ఉక్కు పరిశ్రమ విషయమై ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తుంటే, అదే అంశమై కేంద్రానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లి… దీక్షపై చలోక్తులు విసురుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టెలీ కాన్ఫరెన్స్ లో ఎంపీలను మందలించారు. అయితే, ఈ ఘటనపై ఎంపీలు వివరణ ఇచ్చుకున్నారు. తమ మాటలు వైరల్ కావడం బాధాకరంగా ఉందని ఎంపీ మురళీ మోహన్ అన్నారు.
ఉద్దేశపూర్వకంగా తమను అన్ పాపులర్ చేయాలన్న ఉద్దేశంతోనే కొంతమంది చేసిన కుట్ర ఇది అన్నారు..! తమ మాటల్ని కత్తించారని మురళీ మోహన్ అంటే.. కావాల్సిన విధంగా కట్ అండ్ పేస్ట్ చేసుకున్నారని అవంతి శ్రీనివాస్ చెప్పారు. భాజపా, వైకాపా, పవన్ వంటివారే ఈ తరహా ప్రయత్నాలు చేస్తారంటూ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఏపీ ప్రయోజనాల విషయమై జగన్, పవన్ లు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ఆయన మాట్లాడారు. అయితే, ఈ చిట్ చాట్ వీడియో ఎవరు తీశారో, దీన్ని ఎవరు వైరల్ చేశారనే అంశంపై విచారణ చేపట్టాలని కూడా టీడీపీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని టీడీపీ కాస్త సీరియస్ గానే పరిగణించిందనీ తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన సమావేశానికి సంబంధించిన విజువల్స్ ఎలా బయటకొచ్చాయనేది విచారిస్తారట..!
ఈ విషయంలో పోవాల్సిన పరువు ఎలాగూ పోయింది. ఇప్పుడు దీనిపై… ఎడిట్ చేశారు, కట్ చేశారు, డబ్బింగ్ చేసి స్పెషల్ ఎఫెక్ట్స్ వేశారు అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా..? ఆ వీడియో అంతా సింగిల్ టేక్ తో తీసింది. దాన్లో కట్ లు, ఫ్రేమ్ జంపింగులు ఏవీ లేవు. మురళీ మోహన్ మాటలు, అవంతి శ్రీనివాస్ స్పందన, జేసీ వ్యాఖ్యలు.. అన్నీ ఒకేసారి వినిపిస్తాయి, కనిపిస్తాయి. కాబట్టి, ఇది తయారు చేసిన వీడియో, మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ ఇంకా మాట్లాడుతూ పోతే.. మరిన్ని విమర్శలు తప్పవు. ఈ వ్యవహారంపై దర్యాప్తులు, చర్యలు అనడం కూడా హాస్యాస్పదంగానే వినిపిస్తోంది. దీన్ని ఎవరో చేసిన కుట్రగానో చూపించే ప్రయత్నం చేయడం ద్వారా మరిన్ని విమర్శలే తప్ప.. ప్రయోజనం గుండు సున్న.