రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచీ కన్నా లక్ష్మీ నారాయణ చేస్తున్న విమర్శలు తెలిసినవే. టీడీపీ పాలన అంతా అవినీతిమయమనీ, ఆంధ్రాలో పాలనే సాగడం లేనట్టు, కేంద్రం ఇస్తున్న సొమ్ముతో మాత్రమే పాలన సాగుతున్నట్టు ఆయన విమర్శిస్తుంటారు. ఇసుక నుంచి రాజధాని భూముల వరకూ అన్నింటా అవినీతే అంటారు. అయితే, కన్నా విమర్శలకు కౌంటర్ గా ఇంతవరకూ టీడీపీ నేతలు మాట్లాడుతూ వచ్చారు! ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కన్నాకు కౌంటర్ ఇచ్చారు.
కాకినాడలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రా విషయంలో కేంద్రం ఇంత అన్యాయం చేస్తుందని తాను ఊహించలేదని చంద్రబాబు చెప్పారు. అయితే, ఏపీకి న్యాయం చేసేవరకూ వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ, పోరాటం కొనసాగుతుందని సీఎం అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది రూ. 1500 కోట్లు మాత్రమేననీ, వారు ఇచ్చిన నిధులతో హైకోర్టు భవన నిర్మాణం కూడా పూర్తి కాదన్నారు. కేంద్రం ఇచ్చిన హామీల సాధన కోసం నాలుగేళ్లపాటు తాను ఢిల్లీ వెళ్లాననీ, అన్ని విధాలుగా ప్రయత్నించాననీ, ఇలా ప్రయత్నించడం తప్పా అని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.
తరచూ విమర్శలు చేస్తున్న కన్నా గురించి ప్రస్థావిస్తూ.. విలువలులేని నేతలు తనపై విమర్శలు చేస్తూ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటి భాజపా అధ్యక్షుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారనీ, పదవి కోసం పార్టీలు మారారన్నారు. ఇక భాజపా అధికారంలోకి రాదని గ్రహించి, వైకాపాలో చేరేందుకు మూటాముల్లె సర్దుకుని సర్వం సిద్ధం చేసుకున్నారన్నారు. బ్యానర్లు వేసుకుని, వాహనాలు కూడా రెడీ చేసుకున్నాక ఆయనకి అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిందన్నారు. తనను భాజపా నుంచి వైకాపాలోకి పోవద్దనీ, జగన్ తో తాము మాట్లాడతామని భరోసా ఇస్తే.. కన్నా మళ్లీ ఇప్పుడు భాజపాలో కొనసాగుతున్నారనీ, ఇప్పుడు ఆయన భాజపా అధ్యక్షుడు అయ్యారని చంద్రబాబు అన్నారు. అలాంటి నాయకుడు తనని విమర్శిస్తున్నారని అన్నారు. వైకాపాకి సొంత మైకు, భాజపాకి అద్దె మైకుగా ఉన్న వీళ్లా నన్ను విమర్శించేదన్నారు. వైకాపా, భాజపాలను ఒకే గాటన కట్టి ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించడం విశేషం.