మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఎన్నికలయిన లగడపాటి..రాష్ట్ర విభజన జరిగితే.. రాజకీయాల నుంచి వైదొలుగుతానని చాలెంజ్ చేశారు. అన్నట్లుగానే గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. గత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ.. తన ఆర్జీ ఫ్లాష్ టీం ద్వారా… దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా.. సర్వేలు చేస్తూ ఫలితాలు ప్రకటిస్తున్నారు. తన వ్యక్తిగత ఆసక్తి మేరకే.. తాను ఈ పని చేస్తున్నానని మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పదే పదే చెప్పారు. నంద్యాల ఉపఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో ఆర్జీ ఫ్లాష్ టీం చేసిన సర్వే నూరు శాతం నిజమైంది.
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును.. లగడపాటి రాజగోపాల్ తరచూ కలుస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని భేటీలని ప్రచారం జరుగుతున్నప్పటికీ… టీడీపీలో మాత్రం ఊహాగానాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం..ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి… ఓ సర్వే నివేదికను అందజేసినట్లు ప్రచారం జరిగింది. దాని ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 110 స్థానాలు వస్తాయని అంచనా వేసినట్లు సమాచారం.. అప్పుడే.. లగడపాటి రాజకీయాల్లోకి రీఎంట్రీ విషయంపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. పార్లమెంట్‌కు కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ఇప్పుడు టీడీపీలో జరుగుతున్నట్లు సమాచారం.
లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే అది టీడీపీ ద్వారానే కానీ.. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు చూడరని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజకీయాల నుంచి విరమించుకున్నా.. విజయవాడలో ఆయన తన వర్గంతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఏలూరు లేదా నూజివీడు స్థానాల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విశ్లేషణ లగడపాటి తన సన్నిహితులతో ప్రారంభించారని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు ఖాయం అని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. లగడపాటి.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే.. తన నిర్ణయాన్ని ఇంకా ఎన్నో రోజులు రహస్యంగా ఉంచే అవకాశం మాత్రం ఉండదు.