తెలంగాణలో పుంజుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీన్లో భాగంగానే తెలంగాణ ఏర్పాటుపై గత ఎన్నికల్లో పొందలేని ప్రచార లబ్ధిని, ఈ ఎన్నికల్లో పొందాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి, కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ, ఇచ్చింది మేమే అని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో కాంగ్రెస్ వెనకబడింది. కానీ, ఇప్పుడు అదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టి. నేతలు ప్రయత్నిస్తున్నారు. ‘సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ’ అంటూ ప్రచారం మొదలుపెడుతున్నారు. అయితే,ఈ ప్రచారంపై ఇప్పట్నుంచే తెరాస జాగ్రత్త పడుతోంది. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు.
తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు, బొమ్మా కాదు అంటూ తిప్పికొట్టారు. ప్రజలు కొట్లాడి కేంద్రం నుంచి గుంజుకుంటే వచ్చిన తెలంగాణ ఇది అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కు నిజంగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షపై ప్రేమే ఉంటే.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు రాష్ట్రం ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం తీవ్రతరం కావడంతో, ఇక ఇయ్యకపోతే ప్రజలు కొట్టేలా ఉన్నారన్న భయం వచ్చాకనే రాష్ట్రం ప్రకటించారన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షలు, ప్రజల ఉద్యమాలు ఇవన్నీ కేంద్రంపై ఒత్తిడి పెంచాయన్నారు. స్వతంత్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆనాడు మహాత్మాగాంధీ చెప్పారనీ, లంగ నేతలు పుడతారన్న భయంతోనే ఈ మాట చెప్పారన్నారు. ఎలకలు చంపి తిన్న పిల్లి తీర్థయాత్ర చేసినట్టుగా కాంగ్రెస్ నాయకుల తీరు ఉందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
నిజానికి, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ తెరాస స్పందించలేదు. రాష్ట్రం ఇచ్చింది తామేననీ, అభివృద్ధి చేయాలన్నా అది తమకే సాధ్యమని ఈ మధ్య కాంగ్రెస్ ప్రచార హోరు పెంచింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రాష్ట్రం ఇచ్చిన సెంటిమెంట్ తమకు అనుకూలించే అంశం అవుతుందని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది. అయితే, ఆ సెంటిమెంట్ ను సెంటిమెంట్ తోనే తిప్పి కొడుతున్నారు మంత్రి కేటీఆర్. మరోసారి ఉద్యమ క్రమాన్ని ప్రజలకు గుర్తు చేయడం ద్వారా భావోద్వేగాలను తమవైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని చూడాలి. కాంగ్రెస్ ప్రచారం విషయంలో ఇది తెరాస ముందు జాగ్రత్త చర్యగానే కనిపిస్తోంది.