‘పెళ్లి చూపులు’తో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. అతను తీసిన తాజా సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. విమర్శకుల్లో కొందరికి సినిమా నచ్చింది. కొందరికి నచ్చలేదు. ఎవరి అభిప్రాయం వారిది. నచ్చినవాళ్లు పొగుడుతూ… నచ్చనివాళ్లు విమర్శిస్తూ రివ్యూలు రాశారు. ఆ విమర్శలు దర్శకుడు తరుణ్ భాస్కర్‌కి నచ్చలేదు. సోషల్ మీడియాలో రివ్యూలు రాసే వారిపై విరుచుకుపడ్డారు. వారికి ఏం అర్హత వుందని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు రివ్యూలపై రివ్యూ రాస్తానని చెప్పుకొచ్చారు. ఫిల్మ్ మేకింగ్, రైటింగ్, స్క్రీన్ ప్లే ఇతర అంశాలపై రివ్యూ రాసేవారి అవగాహన సున్నా అని విమర్శించారు. ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ చేసినవారు రాయాలని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలు చూశాక… తరుణ్ భాస్కర్‌కి ఏమైంది? అని ప్రేక్షకులలో అతణ్ణి అభిమానించే జనాలు కూడా అనుకుంటున్నారు. విమర్శలు ప్రతి సినిమాకి వస్తాయి. ‘బాహుబలి’ నచ్చనివాళ్లు కూడా వున్నారు. అలాగాని రాజమౌళి మాట జారలేదు. అగ్ర దర్శకులు ఎంతోమందిపై విమర్శలు వచ్చాయి. వారంతా ఇలా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. చిన్నపాటి విమర్శలను సహించలేకపోతే ఎలా? అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రేపు ప్రేక్షకులు ఎవరైనా విమర్శిస్తే… సినిమా చూడాలంటే ‘ఫిల్మ్ వాచింగ్ కోర్స్’ చేయాలి. ఎలా సినిమా చూడాలో ప్రేక్షకులు నేర్చుకోవాలని చెబుతారా? ఏంటో మరీ అంత ఆవేశం వెళ్లగక్కితే ఎలా? భవిష్యత్తులో బోలెడు సినిమాలు తీయాలి. ఎవరి సలహాలు, సూచనలు స్వీకరించకుండా తను తేసిందే వేదం అనుకుంటే తత్వం బోధపడుతుంది.