ఎన్టీఆర్-తివిక్రమ్ కాంబినేషన్ మీద వున్న ఆసక్తి ఇవ్వాళ, నిన్నటిది కాదు. ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ కోసం ఆ ఇద్దరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాంటి కాంబినేషన్ ఇప్పుడు, ‘ అరవింద సమేత వీర రాఘవ’ అంటూ ముస్తాబవుతోంది. సహజంగానే బయ్యర్లలో కూడా ఉత్సాహం వుంది. అయితే ఆంధ్రలో నలభై కోట్ల మేరకు వ్యాపారం చేసేంత సీన్ వుందా అన్నది అనుమానం. ఎందుకంటే బ్లాక్ బస్టర్ కావాలి. ఇంటిల్లిపాదిలీ బయటకు వచ్చి సినిమా చూడాలి. అప్పుడే ఆంధ్రలో 40 కోట్ల మేరకు వసూళ్లు సాధ్యమవుతాయి.
త్రివిక్రమ్ కు అజ్ఞాతవాసి మాత్రమే నలభై కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. కానీ వసూళ్లు ఆ మేరకు లేవు. ఎన్టీఆర్ కు ఇప్పటి వరకు ఆంధ్రలో నలభై కోట్ల వసూళ్లు లేవు. పోనీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చూసుకుంటే, రంగస్థలం మాత్రమే నలభై అయిదు కోట్లకు పైగా ఆంధ్రలో వసూలు చేసింది. భరత్ అనే నేను నలభై కోట్ల లోపే ఆగిపోయింది. మరి ఏ ధైర్యంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను ఆంధ్రలో నలభై కోట్ల రేంజ్ లోమార్కెట్ చేస్తున్నారు? బయ్యర్లు కొంటున్నారు?
హారిక హాసిని సంస్థ మీద నమ్మకం అని మాత్రమే అనుకోవాల్సి వస్తోంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయితే, 20 పర్సంట్ చాంబర్ అగ్రిమెంట్ మేరకు కాస్త నష్టాలను ఆ సంస్థ పూడ్చింది. ఈ సారి కూడా బయ్యర్లకు అదే ధైర్యం కావచ్చు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఏమాత్రం బాగున్నా, ముఫై కోట్ల మేరకు వసూళ్లు వుంటాయి. సినిమా సూపర్ అయితే సమస్య లేదు. లేదూ తేడా వచ్చినా, ఆంధ్రలో ఓ నాలుగైదు కోట్లు వెనక్కు ఇచ్చేస్తుంది హారిక హాసిని అనే నమ్మకం. అందుకే బయ్యర్లు మారుమాట్లాడకుండా హారికహాసిని చెప్పిన రేట్లకు కొంటున్నట్లు కనిపిస్తోంది.
లేదూ అంటే మూడు కోట్లు కూడా భరత్ అనే నేనుకు నెల్లూరులో రాలేదు. అక్కడ కూడా అరవింద సమేత సినిమాను అంతంత రేట్లు ఇచ్చి కొనడం ఏమిటి? దీని వెనుక ధీమా, హారిక హాసిని బయ్యర్లను అవసరం అయితే ఆదుకుంటుందనే నమ్మకమే అనుకోవాలి.