పవన్ కల్యాణ్ పేరుకి, ఫొటోకి ఉన్నక్రేజ్ అంతా ఇంతానా? అందుకే పవన్ పేరు తెగ వాడేసుకుంటుంటారు. షకలక శంకర్ కూడా అదే చేశాడు. తాను హీరోగా చేసిన తొలి సినిమా `శంభో శంకర`లో పవన్ రిఫరెన్సులు బోలెడన్ని. కండువా దగ్గర్నుంచి కటౌట్ వరకూ. ప్రతీ పావు గంటకోసారి పవన్ నామ జపం సాగింది. ప్రతీసారీ పవన్ పేరు పలకడం ఓవర్‌గా ఉంటుంది కదా? అందుకే తన ఇంటి ముందే.. శివుడి ఆకారంలో పవన్ ఫ్లెక్సీని నిలబెట్టి, రోజూ దానికి పూజ చేసేట్టు చూపించి, దండకాలు కూడా పాడేశాడు. కండువా గురించి ఓ డైలాగ్ చెప్పాడు. గబ్బర్ సింగ్ పోస్టర్ చూపించి కొన్ని డైలాగులు వాడుకున్నాడు. ఇలా ఎక్కడ పడితే అక్కడ పవన్ నామ జపమే కనిపించింది. ఇదంతా తనకు వర్కవుట్ అవుతుందని శంకర్‌కి బాగా తెలుసు. ఇప్పుడు అదే జరిగింది. ఉత్తరాంధ్రలో శంకర్‌కి కాస్త క్రేజ్ ఉంది. అక్కడ శంకర్ సినిమా అనగానే.. జనాలు చూడ్డానికి థియేటర్‌కి వస్తున్నారు. దానికి తోడు పవన్ రిఫరెన్సులు ఎక్కువగా ఉండడం, శంకర్ స్వతహాగా పవన్‌కి వీరాభిమాని కావడం, దానికి తోడు ఈ సినిమా ప్రమోషన్లలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో పవన్‌ని గెలిపించాలి… జగన్ కూడా వచ్చి ఈ పార్టీలో చేరాలి అంటూ విచిత్రమైన స్టేట్మెంట్లు ఇవ్వడంతో పవన్ అభిమానుల్ని ఈజీగా ఆకట్టుకోగలిగాడు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. సినిమాలో సరుకు లేకపోయినా… పవన్ ఫ్యాన్స్ అండ దండతో కలక్షన్లు బాగానే వస్తున్నాయి. తొలిరోజు.. శంకర మంచి ఓపెనింగ్స్ అందుకోగలిగింది. ఇదంతా.. పవన్ మంత్ర మహిమే అని చెప్పుకుంటున్నాయి. మొత్తానికి శంకర్ ప్లాన్ వర్కవుట్ అయినట్టే.